- ఆ ప్రాజెక్టులో కొన్నవారికి చివరకు మిగిలే ప్రశ్న ఇదే..
- రూ.27 లక్షలకే 2 బీహెచ్ కే అంటూ ఏవీ ఇన్ ఫ్రాకన్ ప్రకటన
- హెచ్ఎండీఏ లోగోతో అక్రమంగా అమ్మకాలు
‘పటాన్ చెరు బస్టాండ్ కి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో అదిరిపోయే అపార్ట్ మెంట్. 2 బీహెచ్ కే కేవలం రూ.28 లక్షలకే.. ప్లాట్లు చాలా పరిమితంగా ఉన్నాయ్ త్వరపడండి’ – ఇదీ ఏవీ ఇన్ ఫ్రాకన్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ప్రకటన.
సిమెంట్, స్టీల్ సహా నిర్మాణరంగానికి సంబంధించిన సామగ్రి ధరలు విపరీతంగా పెరిగి, నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతున్న తరుణంలో 1015 చదరపు అడుగులతో కూడిన 2 బీహెచ్ కే ఫ్లాట్ ను రూ.28 లక్షలకే ఇచ్చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. పైగా ఆ ప్రకటనపై హెచ్ఎండీఏ లోగో సైతం వేసి అక్రమ ప్రచారం చేస్తోంది. ఆ లోగో కింద హెచ్ఎండీఏ ప్రపోజ్డ్ లేఔట్ అని చిన్నగా వేసింది.
ఇలా అమాయకులను బుట్టలో వేసుకుని వారిని నిలువునా ముంచడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సంస్థ పటాన్ చెరులోని పోచారంలో రూ.27 లక్షలకే డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అంటూ మరో ప్రకటన ఇచ్చింది. ఇందులో 208 ప్లాట్లను కడతామని చెప్పి ఇప్పటికే అమ్మకాలు కూడా మొదలుపెట్టింది. వీటిని నమ్మి ఆ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ కొన్నారో ఇక అంతే సంగతులు.. ఆపై ‘మేం కొన్న ఫ్లాట్లు ఏవీ.. ఎక్కడ’ అంటూ వెతుక్కునే పరిస్థితి రావడం ఖాయం.