- పెరిగిన సరఫరా.. తగ్గిన అమ్మకాలు
- రూ.80-150 లక్షల ప్రాజెక్టులే ఎక్కువ
- మిగతా నగరాలతో పోల్చితే.. మన వద్ద
అఫర్డబుల్ ప్రాజెక్టులు తక్కువ - హైఎండ్ ప్రాజెక్టుల మీద డెవలపర్ల దృష్టి
- శాస్త్రీయ పరిశోధన లేకుండానే
కొత్త ప్రాజెక్టుల ప్రకటన
హైదరాబాద్ డెవలపర్లు మార్కెట్ గమనాన్ని సరిగ్గా అంచనా వేయట్లేదనిపిస్తోంది. ఏయే విభాగంలో ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి? వాటి అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతమున్న స్టాక్ అమ్ముడు కావాలంటే ఎంతకాలం పడుతుంది? అదే విభాగంలోకి ఎన్ని కొత్త ప్రాజెక్టులు ఆరంభమవుతాయి? తదితర అంశాల్ని పక్కాగా బేరీజు వేయట్లేదు.
కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్లుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభిస్తున్నారని తెలుస్తోంది. దీని వల్ల హైదరాబాద్ రియల్ రంగంలో అమ్ముడు కాని ఫ్లాట్ల సంఖ్య ఎంతలేదన్నా లక్ష దాకా ఉన్నాయి. వీటిలో గేటెడ్ కమ్యూనిటీల్లోనే సుమారు 72000 దాకా ఉండటం గమనార్హం. శివారు ప్రాంతాల్లో నేటికీ ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లు కొనేవారు తగ్గిపోయారు. కారణం.. రేటు అధికంగా ఉండటమే.
హైదరాబాద్లో సరఫరా పెరిగింది. దీని వల్ల ఎవరికీ పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే కొనేవారూ గణనీయంగా పెరుగుతున్నారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారూ అధికం అవుతున్నారు. సమస్య ఎక్కడొస్తుందంటే.. భాగ్యనగరంలో డెవలపర్లలో 53 శాతం మంది హై ఎండ్ అపార్టుమెంట్లనే ఆరంభిస్తున్నారు. వీటి ధర సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1.50 కోట్ల మధ్యలో ఉంటుంది.
కోటిన్నర నుంచి రూ.2.5 కోట్ల మధ్యలో 10 శాతం, అల్ట్రా లగ్జరీ అంటే రెండున్నర కోట్లు దాటిన నిర్మాణాలు సుమారు 4 శాతం మంది కడుతున్నారు. అంటే, సుమారు 67 శాతం మంది వీటి మీదే ఆసక్తి చూపెడుతున్నారు. కానీ, కొనుగోలుదారులేమో అఫర్డబుల్ లగ్జరీ ఇళ్ల కోసం చూస్తున్నారు.
బెంగళూరులో అఫర్డబుల్ గృహాలు ఎక్కువే
విచిత్రం ఏమిటంటే.. ఐటీ రంగం ఎక్కువగా విస్తరించిన బెంగళూరులో కూడా హై ఎండ్ నిర్మాణాల శాతం 34 కావడం గమనార్హం. అక్కడ నేటికీ రూ.40 లక్షల్లోపు ఫ్లాట్లను కట్టే బిల్డర్లు సుమారు 23 శాతం మంది ఉన్నారు. 26 శాతం మంది మిడ్ సెగ్మంట్ అంటే 40 నుంచి 80 లక్ష ల మధ్యలో ఫ్లాట్లను కడుతున్నారు. అంటే, బెంగళూరులో నేటికీ సుమారు 49 శాతం మంది అఫర్డబుల్, మిడ్ సెగ్మంట్ ఫ్లాట్లను కడుతున్నారు.
కానీ, మన హైదరాబాద్లో మాత్రం కేవలం 32 శాతం మంది రూ. 80 లక్షల్లోపు రేటు గల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. రూ.40 లక్షల్లోపు కట్టేవారైతే.. మరీ నాలుగు శాతమే ఉన్నారు. పుణె, చెన్నై వంటి నగరాల్లో నేటికీ రూ.40 నుంచి రూ. 80 లక్షల్లోపు ఫ్లాట్లు లభిస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, కోల్ కతాలో నేటికీ అందుబాటు ధరలో ఫ్లాట్లు దొరుకుతుండటం విశేషం. కానీ, మన వద్దనేమో రూ.80 లక్షల నుంచి రూ.1.50 కోట్ల విలువ గల ఫ్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి మన మార్కెట్‌ను మనమే నాశనం చేస్తున్నామని చెప్పొచ్చు.
51 శాతం మంది హైఎండ్ ఫ్లాట్లు..
హైదరాబాద్లో ఇటీవల కాలంలో కొత్తగా ఆరంభమైన అపార్టుమెంట్లలో ఎక్కువగా హైండ్ ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ సెగ్మంట్లో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. మళ్లీ, కొత్తగా ఇదే విభాగంలో సరికొత్త ప్రాజెక్టులు ఆరంభమవుతున్నాయి. దీని వల్ల ఆయా ప్రాజెక్టుల్లో అమ్మకాలపై ఎక్కడ్లేని ప్రభావం పడుతుంది. సుమారు 51 శాతం మంది ఇటీవల కాలంలో రూ.80 లక్షల నుంచి కోటిన్నర మధ్య రేటు గల ప్రాజెక్టుల్ని ఆరంభించారు. పదహారు శాతం మంది డెవలపర్లు ఆ తర్వాతి విభాగాలైన లగ్జరీ, అల్ట్రా లగ్జరీ సెగ్మంట్లకు శ్రీకారం చుట్టారు.
ఇలాంటి విక్రుతమైన పోకడ కేవలం హైదరాబాద్లోనే ఉండటం గమనార్హం. అంటే, నగర డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి సర్వే జరపకుండానే నిర్మాణాల్ని ఆరంభిస్తున్నారని అర్థమవుతోంది. దీని వల్ల ఇక్కడి అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పుడున్న ఫ్లాట్లు అమ్ముడు కావాలంటే ఎంతలేదన్నా రెండేళ్లయినా పడుతుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొత్తగా ఆరంభమయ్యేవి అమ్ముడు కావాలంటే మరింత కాలం పడుతుందని చెప్పొచ్చు.