- సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు
దేశవ్యాప్తంగా రెరా చట్టం అమల్లోకి రాక ముందు ప్రారంభమై నిలిచిపోయిన పలు ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి నిర్మాణాల పునరుద్ధరణకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఆయా ప్రాజెక్టుల్లో ఇళ్లను కొనుగోలు చేసినవారికి అవి పొందేలా చేయడానికి అవసరమైన చర్యలను ఈ కమిటీ చేపట్టనున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రెరా చట్టం కింత ఏర్పాటైన కేంద్ర సలహా మండలి (సీఏసీ) మూడో భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఇళ్ల కొనుగోలదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పారు. అలాగే రియల్ రంగంలో మరింత పాదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు రెరాను సమర్థంవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.