పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదైన తప్పులను ధరణి వెబ్ సైట్ ద్వారా సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ధరణి వెబ్ సైట్ లో కొత్త మాడ్యూల్ ప్రవేశపెట్టింది. దీంతో పాస్ బుక్ లో నమోదైన 11 రకాల తప్పులను సరిచేసుకునే అవకాశం కలగనుంది. ధరణి వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కొత్తగా ప్రవేశపెట్టిన టీఎం 33 అనే మాడ్యూల్ ద్వారా లాగిన్ కావాలి. అనంతరం మన సర్వే నెంబర్, ఖాతా నెంబర్, పాస్ బుక్ నెంబర్ నమోదు చేసే ప్రస్తుతం ఆ పాస్ బుక్ లో ఉన్న వివరాలతోపాటు ఎక్కడ తప్పులు దొర్లాయో సరిదిద్దుకునే ఆప్షన్లు ఉంటాయి.
పేరు, భూమి స్వభావం, భూమి వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం, సర్వే నెంబర్లలో తప్పులు వంటి 11 రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మనం మార్పు చేసుకోవాలనుకునే ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం మన చిరునామా ఇవ్వాలి. దీంతోపాటు పాత పట్టాదారు పాస్ బుక్, పాత పహాణీ, దస్తావేజులను అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇందుకు నిర్దారిత ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం జిల్లా కలెక్టర్ దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఆన్ లైన్ లోనే కాకుండా ఈ సేవ కేంద్రాల ద్వారా కూడా ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.