-
- ఏవీ ఇన్ ఫ్రాకన్ మాయాజాలం
- పటాన్ చెరులో రూ.25.5 లక్షలకే ఫ్లాట్ అని ప్రచారం
- ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కొనుగోలుదారులకు బురిడీ కొట్టే యత్నం
‘పటాన్ చెరు పోచారంలో ఎన్నెన్నో సౌకర్యాలు, అధునాతన వసతులతో 2 బీహెచ్ కే ఫ్లాట్ కేవలం రూ.25.50 లక్షలకే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి’ – ఇదీ ఏవీ ఇన్ ఫ్రాకన్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ప్రకటన. సిమెంట్, స్టీల్ సహా నిర్మాణరంగానికి సంబంధించిన సామగ్రి ధరలు విపరీతంగా పెరిగి, నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతున్న తరుణంలో 1020 చదరపు అడుగులతో కూడిన 2 బీహెచ్ కే ఫ్లాట్ ను ప్రీ లాంచ్ ఆఫర్ లో భాగంగా కేవలం రూ.25.5 లక్షలకు, 1500 చదరపు అడుగుల 3 బీహెచ్ కేను 37.5 లక్షలకు ఇస్తామని బురిడీ కొట్టిస్తోంది.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న బ్రిజ్ హైట్స్ లగ్జరీ అపార్ట్ మెంట్స్ లో వెంటనే ఫ్లాట్ సొంతం చేసుకోవాలని మాయమాటలు చెబుతోంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని, 75 శాతం బ్యాంకు రుణం కూడా ఉందని అంటోంది.
రెరా, హెచ్ ఎండీఏ అనుమతులు వచ్చిన తేదీ నుంచి రెండేళ్లలో ఫ్లాట్ అప్పగిస్తామని చెబుతోంది. ఈ మేరకు విపరీతంగా ప్రచారం చేస్తోంది. నిజానికి రెరా అనుమతి లేని ప్రీలాంచ్ ఆఫర్లో అమ్ముతున్న ఇలాంటి అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు కొనకపోవడమే మంచిది. అనుమతులు లేని ప్రాజెక్టుల్లో సొమ్ములు పెట్టి చేతులు కాల్చుకునేకన్నా వాటికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం అని అటు రెరా, ఇటు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నా.. ఇలాంటి దందాలకు అడ్డుకట్ట పడటంలేదు.
రెరా అనుమతి లేని ఫ్లాట్ల విక్రయాలే కాదు.. కనీసం ప్రచారం కూడా చేయకూడదు. కానీ అలాంటి నిబంధనలన్నీ తుంగలో తొక్కి కొనుగోలుదారులను బట్టలో పడయడమే లక్ష్యంగా ఇలాంటి ప్రీలాంచ్ దందాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వాటి పట్ల కొనుగోలుదారులే అప్రమతంగా ఉండాలి. అదే సమయంలో ఇలాంటి ప్రాజెక్టులను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్ల కు కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. వాటికీ రెరా అథారిటీ నోటీసులు జారీ చేయాలి.