సాధారణంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారు. లేదా ప్లాట్ కింద అమ్మేస్తారు. కానీ ఇండోర్ లో సర్కారు భూమిని కబ్జా చేసి ఏకంగా ఓ కాలనీయే నిర్మించేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా అక్రమంగా దానిని ప్లాట్లుగా వేసి పలువురికి విక్రయించేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఓ మహిళ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సిమ్రోల్ కు చెందిన అమర్ చంద్ తోపాటు అస్రావద్ ఖుర్ద్ కి చెందిన సుమిత్ రాజోరియా, కమల్, సందీప్ బిజోరియా, పూనంచంద్ లపై కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అస్రావద్ ఖుర్ద్ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని వీరు అభివృద్ధి చేశారని, అనంతరం నకిలీ డాక్యుమెంట్లతో పలువురికి ప్లాట్లు విక్రయించారని వెల్లడించారు. కొంతమంది కొనుగోలుదారులు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నకిలీ డాక్యుమెంట్లో ప్లాట్లు అమ్మేశారని.. ఇది తెలియని కొందరు కొనుగోలుదారులు అక్కడ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారని అధికారులు తెలిపారు. అనంతరం ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఐదుగరిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, గతంలో గుర్గావ్ లో సైతం ఇలాంటి వ్యవహారమే చోటు చేసుకుంది. అక్కడ నగరం లోపల, చుట్టూ ఉన్న దాదాపు 30 ఎకరాల స్థలంలో ఏకంగా ఏడు అక్రమ కాలనీలు నిర్మించి ప్లాట్లు అమ్మేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసిన తర్వాత 31 మందిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా సరే ప్లాట్ కొనే ముందు అది క్లియర్ టైటిలా కాదా.. అన్ని అనుమతులూ ఉన్నాయా లేవా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.