- హైదరాబాద్లో సొంతిల్లు ఎంతో ఖరీదు
- ఇది అందుబాటు నగరం కానే కాదిక!
- 100 శాతానికి పైగా పెరిగిన ఇళ్ల ధరలు
- కొన్ని చోట్ల 100 – 200 శాతం పెరుగుదల
- శివార్లలో 2 బెడ్రూముకు రూ.60- 80 లక్షలు
- గేటెడ్‌లో కొనాలంటే.. కనీసం కోటి అవుతుంది
- నగరంలో కోటిన్నర దాకా పెట్టాల్సిందే
కింగ్ జాన్సన్ కొయ్యడ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లయ్యింది.. కొత్త జిల్లాలు ఏర్పాటు.. పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలకు శ్రీకారం.. ఫలితంగా ఎక్కడికక్కడ స్థలాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఏర్పాటుతో ఫ్లాట్ల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆరంభం నుంచి ప్రభుత్వ వినూత్న నిర్ణయాల కారణంగా.. ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, ఫార్మా వంటి రంగాలు వృద్ధి చెందాయి. విద్యుత్తు సమస్యను తగ్గించడం.. చెరువులకు కొత్త కళ తేవడం.. తాగునీటి సరఫరాను మెరుగుపరచడం.. వ్యవసాయ దిగుబడి పెరగడం వంటివన్నీ కళ్ల ముందే సాక్షాత్కరించింది. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంతో పాటు శాంతిభద్రతలకు పెద్దపీట వేయడం వల్ల.. దేశ, విదేశీ సంస్థలు భాగ్యనగరంలోకి అడుగుపెడుతున్నాయి. మొత్తానికి, ఇలాంటి అనేక అంశాల కారణంగా.. నగర రియల్ రంగం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో.. 2014లో ఫ్లాట్ల ధరలెలా ఉన్నాయి? 2017లో ఎంతకు చేరాయి? ప్రస్తుతం ఎంత చెబుతున్నారో చూసేద్దామా..
ఏరియాలు కనీస- గరిష్ఠ కనీస- గరిష్ఠ కనీస – గరిష్ఠ
2014 2017 2022 (చ.అ.కీ. – ధర.రూ.లలో)
అమీర్‌పేట్ 3400-4000 4300- 4800 7000-9000
సనత్ నగర్ 3400-4400 3800- 4200 7000-9000
హిమాయత్ నగర్ 4200-5400 5100- 6000 8000- 10000
జూబ్లీహిల్స్ 5500-7500 8500- 10000 12000- 15000
శ్రీనగర్ కాలనీ 4300- 4800 6000-6600 9000-11000
తెలంగాణ ఆవిర్భావం నాటికి అమీర్‌పేట్‌లో అపార్టుమెంట్ల రేటు చదరపు అడుక్కీ రూ.3400 నుంచి 4000 ఉండేది. భూమి ధర కూడా గజానికి 30 నుంచి 45 వేలు ఉండేది. కాకపోతే, ఆ తర్వాత అమీర్‌పేట్ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. వాణిజ్య ప్రాంతంగా స్థిరపడింది. అందుకే, ఇక్కడ గజం ధర దాదాపు రూ.లక్షకు పైగా చేరింది. కాకపోతే, ఇక్కడ కొత్తగా అపార్టుమెంట్లను కట్టేందుకు పెద్దగా ఖాళీ స్థలాలు అందుబాటులో లేవు. అందుకే, కొంత స్థలం దొరికినా చాలు.. అందులో అపార్టుమెంట్ని నిర్మిస్తే హాట్ కేకులా అమ్ముడవుతాయి. సనత్‌నగర్ విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ.3400 నుంచి 4400 ఉన్న రేటు ప్రస్తుతం 7000 నుంచి 9000 చెబుతున్నారు. స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లలో రేటు తక్కువుంటే.. ఇక్కడ ఆరంభమయ్యే గేటెడ్ కమ్యూనిటీల్లో రేటు సుమారు రూ.9000కు చేరుకుంది. హిమాయత్ నగర్‌లో ప్రస్తుతం ఎకరాల్లో స్థలం దొరకడం కష్టమే. అందుకే, ఇక్కడ స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లనే ఎక్కువగా నిర్మిస్తారు. కాకపోతే, అవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఏరియాలు కనీస- గరిష్ఠ కనీస- గరిష్ఠ కనీస – గరిష్ఠ
2014 2017 2022 (చ.అ.కీ. – ధర.రూ.లలో)
మోతీనగర్ 2000- 2200 3200-3600 6000-9000
కేపీహెచ్‌బీ కాలనీ 3000-3600 3900-4200 7000-10000
మాదాపూర్ 3000-4000 4600-5200 8000-12000
మదీనాగూడ 2200-2400 3100- 3600 6000-7000
చందానగర్ 2400-2900 2800- 3200 5000-6000
మియాపూర్ 2200-2600 3200-3600 5000-7000
2014 వరకూ మోతీనగర్ మధ్యతరగతి ప్రజానీకానికి చిరునామాగా ఉండేది. సుమారు రూ.30 లక్షలు పెడితే ఫ్లాట్లు లభించేవి. ఆ తర్వాత ఆ రేటు రూ.40 నుంచి 50 లక్షలకు చేరింది. ప్రస్తుతం 70 నుంచి 90 లక్షలు పెట్టనిదే ఇక్కడ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు లభించని పరిస్థితి. పైగా, కొత్త అపార్టుమెంట్లు పెద్దగా అందుబాటులో లేవు. ఈ కారణంగా కొందరు మధ్యతరగతి ప్రజానీకం ఇక్కడ పాత ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఏరియాలు కనీస- గరిష్ఠ కనీస- గరిష్ఠ కనీస – గరిష్ఠ
2014 2017 2022 (చ.అ.కీ. – ధర.రూ.లలో)
ప్రగతినగర్ 1800- 2200 3000- 3600 4500- 6500
బాచుపల్లి 1800- 2000 2600- 3000 4500- 6000
అల్వాల్ 2000- 2600 2500- 3000 4500- 6000
బోయిన్‌పల్లి 2200- 2800 3000-3400 5000- 7000
కొంపల్లి 2300-2600 2800- 3400 5000- 6000
ఏఎస్ రావు నగర్ 2000-2400 2600- 3100 4500- 6000
ప్రగతినగర్ అంటే చిన్న అపార్టుమెంట్లకు చిరునామా అని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లే కనిపిస్తాయి. కొందరు బిల్డర్లు రెండు వందల గజాల ప్లాట్లను పక్కపక్కన పెట్టేసి.. 400 గజాల్లోనూ అపార్టుమెంట్లను నిర్మించారు. అనుమతికి దరఖాస్తు చేసేటప్పుడు రెండు వేర్వేరుగా చూపెట్టి.. ఆతర్వాత వాటిని కలుపుకుని కట్టేవారు. ఈ పద్ధతి ఎక్కువగా ప్రగతినగర్, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. నిన్నటివరకూ కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు మోక్షం లభించడంతో పలు బడా కమ్యూనిటీలు ఇక్కడ ఆరంభమయ్యాయి. అలాంటి కంపెనీల్లో ఫ్లాట్ల రేట్లు ఎక్కువే చెబుతున్నారు. 2014లో చదరపు అడుక్కీ రూ.2000కు లభించే ఫ్లాట్లు.. ప్రస్తుతం రూ.6000పై మాటే చెబుతున్నారు. కాకపోతే, చిన్న అపార్టుమెంట్లలో ధర నేటికీ అందుబాటులో ఉందని చెప్పొచ్చు.
ఏరియాలు కనీస- గరిష్ఠ కనీస- గరిష్ఠ కనీస – గరిష్ఠ
2014 2017 2022 (చ.అ.కీ. – ధర.రూ.లలో)
ఎల్ బీ నగర్ 2300- 2700 2800- 3200 5000- 7000
ఉప్పల్ 2100- 2700 2600- 3100 5000- 7000
బండ్లగూడ (అప్పా) 2400- 3200 2800- 3600 5500- 6000
రాజేంద్రనగర్ 2300- 2800 2500- 3000 5000- 7000
వనస్థలిపురం 2400- 2800 3600- 4000 6000-7000
ఎల్‌బీనగర్ అంటే ఎప్పటికీ హాట్ కేకే. మెట్రో స్టేషన్ ఇందుకో ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఉప్పల్ కూడా ఇదే పరిస్థితి. కాకపోతే, కోర్ ప్రాంతంలో కాకుండా.. కాస్త కాలనీలోకి వెళితేనే అపార్టుమెంట్ల నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ఫ్లాట్లు కొనాలంటే ఎంతలేదన్నా రూ.80 లక్షలు చేతిలో పట్టుకోవాల్సిందే. బండ్లగూడ, కిస్మత్‌పూర్, పిరంచెరువులో గేటెడ్ కమ్యూనిటీలను కట్టే డెవలపర్లు ఎక్కువే ఉన్నారు. ఇక్కడా 80 లక్షలు పెట్టనిదే డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లను కొనుగోలు చేయలేని పరిస్థితి. రాజేంద్రనగర్‌లో ఇటీవల కాలంలో అపార్టుమెంట్లను కట్టే బిల్డర్లు పెరిగారు. ముఖ్యంగా, అత్తాపూర్ వంటి ప్రాంతంలో స్టాండ్ ఎలోన్ కట్టడాల్ని చాలామంది నిర్మిస్తున్నారు.
గుర్తుంచుకోండి: ఈ రేట్లు కేవలం అవగాహన కోసమే తప్ప తుది ధరలు కావు. అపార్టుమెంట్ ఉన్న ప్రాంతం, నిర్మాణం స్థాయి, అక్కడి మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులోని సౌకర్యాలు, అందులోని ఫీచర్స్, బిల్డర్ అవసరం బట్టి తుది రేటు ఆధారపడుతుంది.