కింగ్ జాన్సన్ కొయ్యడ: అమెరికాలో గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా.. ద్రవ్యోల్బణం 9.1 శాతానికి ఎగబాకింది. ఆర్థిక మాంద్యం ఆరంభమైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా స్టాక్ మార్కెట్ కుదేలైంది. గత రెండు దశాబ్దాల్లో ప్రప్రథమంగా అమెరికా డాలర్ విలువ యూరోకు దాదాపు సమానమైంది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తమ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. మరి, అమెరికా మరియు ఐరోపాలో ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తున్న నేపథ్యంలో.. దాన్ని ప్రభావం మన ఐటీ రంగంపై ఎంత మేరకు పడుతుంది? హైదరాబాద్‌లో ఇళ్లను కొనేవారు తగ్గుతారా?
గతంలో వచ్చిన ఆర్థిక నేపథ్యం ప్రభావం మన హైదరాబాద్ మీద పడేందుకు సుమారు ఏడాది పట్టింది. ఎందుకంటే, అప్పటివరకూ ఐటీ రంగానికి చెందినవారు అధిక శాతం ఇళ్లను కొనేవారు కాదు. పైగా, నగదు చెల్లింపుల్లో ఇప్పుడున్న కఠినమైన నియమ నిబంధనలు అప్పట్లో లేనే లేవు. నగదు తీసుకునేందుకు అప్పట్లో కొందరు డెవలపర్లు అంగీకరించేవారు. కానీ, ఇప్పటి పరిస్థితులు వేరు. ఐటీ నిపుణులైనా, ప్రవాసులైనా.. పూర్తిగా చెక్కు, డీడీల రూపంలోనే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. వీలైనంత వరకూ స్టాంప్ డ్యూటీ చెల్లించి మరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో నల్లధన ప్రవాహం ప్రవాసులు, ఐటీ నిపుణులు చేసే కొనుగోళ్లలో పెద్దగా ఉండదనే చెప్పాలి. కాబట్టి, ఆర్థిక మాంద్యం అమెరికాలో విస్పోటమైతే.. కచ్చితంగా దాన్ని ప్రభావం మన ఇళ్ల అమ్మకాల మీద పడుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.
గూగుల్ ప్రకటన..
ఈ ఏడాది చివరికల్లా ఆర్థిక మాంద్యం ఆరంభమవుతుందని ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. మాంద్యం కారణంగా గూగుల్ కొత్త నియామకాల విషయంలో కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తోందని సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇదే నియమాన్ని దాదాపు అన్ని ఐటీ కంపెనీలూ అనుసరించే అవకాశముందని నిపుణులు అంటున్నారు. న్యూయార్కుకి చెందిన ఓపెన్ సీ అనే ఎన్ఎఫ్‌టీ సంస్థ ఇరవై శాతం ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తాజాగా ట్వీట్ చేసింది. టెస్లా పది శాతం ఉద్యోగుల్ని లేఆఫ్ చేసింది. క్యాలిఫోర్నియాకు చెందిన లోన్ డిపో సంస్థ ఈ ఏడాది చివరికల్లా 2000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఆటోమేకర్ రివియాన్ 5 శాతం ఉద్యోగుల్ని తీసివేస్తామని అధికారికంగా వెల్లడించిది. రియల్ ఎస్టేట్ సంస్థ రీమ్యాక్స్ 17 శాతం స్టాఫ్‌ని తీసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. జేపీ మోర్గాన్ చేస్ కూడా సుమారు వెయ్యి మందిని తొలగించింది. కంపాస్, రెడ్‌ఫిన్ వంటి రియాల్టీ సంస్థలూ 10, 8 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. క్రిప్టో సంస్థ అయిన కాయిన్‌బేస్ 1100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే కార్వానా సంస్థ 2500 మందిని తొలగించింది. మొత్తానికి, అమెరికాలో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తుండటంతో అన్ని రకాల కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. మార్కెట్ మళ్లీ కోలుకున్నాక ఈ కంపెనీలన్నీ మళ్లీ విధుల్లోకి చేర్చుకునే అవకాశముంది. అయితే, మాంద్యం ఛాయలు ఎంతలేదన్నా పద్దెనిమిది నెలల్నుంచి 24 నెలల దాకా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.
మాంద్యం మనకు ప్రయోజనమే!
అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందా? లేదా? అనే అంశంపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి నగదు నిల్వల్ని ఫెడరల్ రిజర్వ్ వెనక్కి తెచ్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దీని వల్ల మార్కెట్లో లిక్విడిటీ తగ్గితే అభివృద్ధికి తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది తప్ప మార్కెట్ మొత్తం కూలిపోయే ప్రమాదమైతే ఉండదు. అయినా, ఆర్థిక మాంద్యంకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే వరకూ మనమంతా వేచి చూడాల్సిందే. ఒకవేళ మాంద్యం ఏర్పడితే.. భారత్ వంటి దేశాలకు ఒకరకంగా ప్రయోజనమేనని చెప్పొచ్చు. ఎందుకంటే, ఆయా కంపెనీలు తక్కువ వ్యయానికే ఉద్యోగుల్ని నియమించడంపై దృష్టి సారిస్తాయి. ఫలితంగా, దక్షిణాసియా దేశాల్లోకెల్లా మనవైపే ఎక్కువగా మొగ్గు చూపే వీలుంటుంది.
మాంద్యంతో మనకే అడ్వాంటేజ్..
అమెరికాలో ఆర్థికమాంద్యం ఏర్పడితే మనకు అడ్వాంటేజే. మనవాళ్లు అక్కడ పెట్టుబడులు పెట్టరు. డాలర్ విలువ రూ.80 అయ్యింది. కాబట్టి, ప్రతి డాలరూను ఇక్కడికే పంపుతారు. 2008లో కూడా ఇదే జరిగింది. అప్పుడూ వంద శాతం సొమ్ము ఇక్కడికే పంపించారు. రానున్న రోజుల్లో ప్రవాసులంతా ఇక్కడే ఇళ్లను కొనే అవకాశం ఉంటుంది. మనవాళ్లు అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్.. ఇలా ప్రతి చోటా ఉండటం వల్ల.. డాలర్లను ఇక్కడికే పంపిస్తారు. అమెరికాలో మాంద్యం ఏర్పడితే ఐటీ సంస్థలు కొత్త కార్యలాపాల్ని విస్తరించరు. కాకపోతే, ప్రస్తుత కార్యకలాపాలన్నీ యధావిధిగానే కొనసాగుతాయి. ఒకవేళ ఐటీ రంగం ద్వారా ఇళ్ల అమ్మకాలు తగ్గినా.. ఫార్మా, సినిమా, పారిశ్రామిక, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలకు చెందిన నిపుణులు ఇళ్లను కొంటారు. ఆర్థిక మాంద్యం వల్ల మన నిర్మాణ రంగానికి ఊపు లేకపోయినా, కొలాప్స్ అవ్వడం మాత్రం ఉండదు. మా ఐకానియాలో ఐటీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, టాప్ పొజిషన్లో ఉన్నవారే కొంటారు. కాబట్టి, మాంద్యం వచ్చినా రాకున్నా మా వంటి కంపెనీల మీద పెద్ద ప్రభావం ఉండనే ఉండదు. ప్రస్తుతం హైదరాబాద్లో మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. –
ఎస్ రాంరెడ్డి, సీఎండీ, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్
ఇక్కడ ఇళ్లను కొంటారు!
అమెరికాలో రిసెషన్ వార్తలు గుప్పమంటున్నాయి. 2023లో ఐటీ కంపెనీలన్నీ కనీసం పది శాతం మంది ఉద్యోగుల్ని తొలగించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే యూఎస్ స్టాక్ మార్కెట్ 20 నుంచి 30 శాతం పడిపోయింది. రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా తగ్గిపోయింది. 2022 జూలై 13న వర్జీనియాలో 609.950 డాలర్లు గల ఇంటిని 549.950 డాలర్లకు విక్రయిస్తున్నారు. నాలుగు నెలల్లో సుమారు పన్నెండు శాతం రేటు తగ్గింది. వచ్చే ఆరు నెలల్లో మరో 20 శాతం ధర పడిపోయే ప్రమాదముంది. వాషింగ్టన్ డీసీ, వర్జీనియాలో గ్యాలన్ పెట్రో ధర 2.99 నుంచి 5.55 డాలర్లకు పెరిగింది. వాషింగ్టన్ డీసీ శివారు ప్రాంతమైన యాష్ బర్న్ లో ఎక్కువగా భారతీయులు ఉంటారనే విషయం తెలిసిందే.
– శ్రీనివాస్ ఆర్ల, అప్లికేషన్ డెవలప్‌మెంట్ మేనేజర్, యాక్సెంచర్.