వివిధ ప్రాజెక్టులు, ప్రమోటర్లపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి మహారాష్ట్ర రెరా పొందుపరిచిన వివరాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫిర్యాదులకు సంబంధించి సరైన వివరాలు లేకపోవడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుందని పలు వినియోగదారుల సంక్షేమ సంఘాలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలోని ఆరు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి మొత్తం 3600 మంది ప్రాజెక్టులపై ఫిర్యాదులు వచ్చినట్టు మహా రెరా తన వెబ్ సైట్ లో పేర్కొంది.
ఇందులో వాదనలు పూర్తయిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. కొనుగోలుదారులు ఏదైనా ప్రాజెక్టులో ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. అయితే, ఆయా ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వల్ల తమకు ఉపయోగం లేదని కొనుగోలుదారులు అంటున్నారు. ఫిర్యాదుపై వాదనలు విన్నామని మాత్రమే అందులో ఉందని.. తర్వాత సదరు బిల్డర్ ఆ సమస్యను పరిష్కరించారా లేదా అనే విషయాలు లేవని పేర్కొంటున్నారు.
ప్రాజెక్టు నంబర్, ప్రాజెక్టు పేరు, డివిజన్, ఫిర్యాదు నెంబర్ మాత్రమే వెబ్ సైట్ లో కనిపిస్తున్నాయని.. ఫిర్యాదుపై వాదనలు విన్న తర్వాత జారీ చేసిన ఆదేశాల వివరాలు లేవని చెబుతున్నారు. అంతేకాకుండా అసలు ఫిర్యాదు ఏమిటనేది కూడా లేదని పెదవి విరుస్తున్నారు.