poulomi avante poulomi avante

మూడు అంశాల్ని గ‌మ‌నిస్తే.. ముచ్చటైన గృహం మీ సొంతం!

అసలే కష్టకాలం.. పైగా ప్రీలాంచుల కలికాలం.. అధిక శాతం మంది డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి వంద శాతం సొమ్ము తీసుకుని జేబుల్ని నింపుకుంటున్న రోజులివి. అందులో కొంత మొత్తంతో కార్లను కొనేసి.. విదేశాల‌కు వెళుతూ.. విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతూ.. వేరే భూముల్లో పెట్టుబడి పెడుతూ కాలం గ‌డిపేస్తున్న ప్ర‌బుద్ధులున్న రోజులివి. మ‌రి, ఇలాంటి బిల్డ‌ర్ల మాయ‌లో మీరు ప‌డ‌కూడ‌దంటే ఏం చేయాలి? క‌ల‌కాలం నివసించాల్సిన ఇంటిని ఎంపిక చేసుకునేట‌ప్పుడు ప‌లు కీల‌క అంశాల‌పై దృష్టి సారించాలి. చూడ‌టానికివి చిన్న‌వే కావొచ్చు.. కాక‌పోతే, మోసపూరిత డెవ‌ల‌ప‌ర్ల బారిన ప‌డ‌కుండా కాపాడేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

కొన్నేళ్లుగా రియల్ రంగానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. డీమానిటైజేషన్, జీఎస్టీ, కొవిడ్ వంటివి ఈ రంగాన్ని దారుణంగా తెబ్బతీశాయి. దీంతో అనేక మంది డెవలపర్లు నగదు కొరతను ఎదుర్కొంటున్న మాట వాస్త‌వ‌మే. ఇలాంటి క‌ఠిన‌మైన స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ.. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కొంత శాతం మంది డెవలపర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాక‌పోతే, పొర‌పాటున మోస‌పూరిత డెవ‌ల‌ప‌ర్ల బారిన ప‌డితే ఎలా? ఇదే ప్ర‌తిఒక్క‌ర్ని వేధిస్తున్న ప్ర‌శ్న‌. బయ్యర్లు ఎదుర్కొనే రిస్కును పరిగణనలోకి తీసుకుని.. కేంద్రం రెరా చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ప్ర‌కారం.. ఒక ప్రాజెక్టు కింద బయ్యర్ల నుంచి తీసుకున్న సొమ్మును మరొక ప్రాజెక్టుకు బదిలీ చేయకూడదు. అమ్మ‌కాల రూపంలో వ‌చ్చే సొమ్ములో డెబ్బయ్ శాతం సొమ్ముని నేరుగా ఆయా నిర్మాణ పనుల నిమిత్తమే వాడాలి.

అయితే, అమ్మకాలు జరిగితే డెవలపర్లకు ఎలాంటి సమస్య ఉండదు. అది లేన‌ప్పుడే ఇబ్బంది. అసలు అమ్మకాల ద్వారా సొమ్మే రాకపోతే, ప్రాజెక్టు ఎలా ముందుకెళుతుంది? ఒక‌వేళ నిర్మాణం ఆల‌స్య‌మైతే డెవ‌ల‌ప‌ర్ల‌కు ప‌రిహారం ఎలాగూ ల‌భిస్తుంది. కానీ, ఉన్న సొమ్మంతా బిల్డర్‌ చేతిలో పోసేసి.. చివరకు కోర్టుల చుట్టూ తిరగడమంటే ఎంత మాన‌సిక వేద‌న‌! మరి, చట్టం చూపెట్టని పరిష్కారాన్ని మీరు కొంత తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తే సరిపోతుంది. ఒక ప్రాజెక్టులో మీరు కొనాలా? వ‌ద్దా? అనే విష‌యం ముందుగా మీకే అర్థమ‌వుతుంది. ఇందుకోసం మీరేం చేయాలంటే?

మీరు ఏదైనా ప్రాజెక్టులో ఫ్లాటును ఎంచుకున్నప్పుడు.. అందులో ఇప్ప‌టికే ఎన్ని ఫ్లాట్లు అమ్ముడయ్యాయనే విషయాన్ని ఎగ్జిక్యూటివ్ ని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ అమ్మకాలు తగిన స్థాయిలో జరిగితే.. నగదు లభ్యతలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవ‌ని గుర్తుంచుకోండి. ఫలితంగా, ప్రాజెక్టు ఆగిపోయే అవకాశమే లేదు. బిల్డ‌ర్ బ‌య్య‌ర్ల‌తో ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే అంశాన్ని తెలుసుకోండి. ఒక‌వేళ స‌ద‌రు బిల్డ‌రుకు బ‌య్య‌ర్లంటే ప‌ట్టింపు లేదు. వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోడంటే మీరు అలాంటి వ్య‌క్తిని ప‌క్క‌న పెట్టేయండి.
మీకు న‌చ్చిన ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు ఆరంభం అవుతుంది. అందులో కొనాలా? వ‌ద్దా? అనే సందేహం మిమ్మ‌ల్ని వెంటాడుతుంది. అలాంటి ప‌రిస్థితిలో మీరు బిల్డ‌ర్‌తో నేరుగా మాట్లాడండి. ఆయా నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్ని ఎలా సమీకరిస్తారని బిల్డర్ ని నేరుగా ప్రశ్నించండి. నిజానికి, టెర్మ్ లోన్ల రూపంలో బ్యాంకులు ప్రాజెక్టులకు రుణాల్ని మంజూరు చేస్తాయి.
ఒకవేళ మీరు కొనాలనుకున్న ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో ఉందనుకోండి.. ఆయా ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని తెలియజేసే ఫోటోలను మీకు పంపించ‌మ‌ని.. లేదంటే ఏదైనా లింకు ఉంటే మీకు పంపించ‌మ‌ని
చెప్పండి. ఆయా ఫోటోలను మీరు క్షుణ్నంగా చూస్తే.. ప్రాజెక్టు పనితీరు మీకు ఇట్టే తెలుస్తుంది. ఆయా డెవలపర్ వద్ద నిధుల కొరత లేకపోతే, నిర్మాణ పనుల్లో వేగం ఫోటోలో కనిపిస్తుంది.

ఇలాంటి కొన్ని అంశాల్ని గమనించడం వల్ల మీరు తప్పకుండా ఓ మంచి ప్రాజెక్టును ఎంచుకుంటారు. సేల్స్ ఏజెంట్లు చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మకుండా.. మీకు అన్నివిధాల నప్పే నిర్మాణాన్ని ఎంచుకుంటారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles