poulomi avante poulomi avante

2 చెరువులు 1 నాలాను మింగేసిన ఫినీక్స్?

  • విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించిన
    ప్రముఖ పర్యావరణవేత్త లుబ్నా సార్వత్
  • పొప్పాల్‌గూడ‌లో చెరువులు, నాలాపై నిర్మాణాలు
  • టీఎస్ఐఐసీ అనుమ‌తి ఎలా ఇచ్చింది?

రంగారెడ్డి జిల్లా పుప్పాల్ గూడలోని 285, 286 స‌ర్వే నెంబ‌ర్ల‌లో.. ఫినీక్స్ ఎస్టేట్స్ అనే నిర్మాణ సంస్థ‌.. మంసానికుంట, మేన‌సానికుంట చెరువుల్ని పూర్తిగా మాయం చేసింద‌ని.. బ‌ల్కాపూర్ నాలా మీద సెల్లార్ క‌ట్టింద‌ని విమెన్స్ ఇండియ‌న్ ఛాంబ‌ర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ‌స్ట్రీ (విక్కీ) వాట‌ర్ రిసోర్స్ అధ్య‌క్షురాలు లుబ్నా సార్వ‌త్ ఆరోపించారు. ఇటీవ‌ల న‌గ‌రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ.. అక్క‌డ 2019 దాకా చెరువులు, క‌ట్ట‌మైస‌మ్మ ఆల‌యం ఉండేవని గుర్తు చేశారు. 2019లో టీఎస్ఐఐసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్వ‌యంగా వెళ్లి స‌ర్వే చేసిన‌ప్పుడు విస్తుగొలిపే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌న్నారు. 6.35 మీట‌ర్ల వెడల్పు గ‌ల ఇన్‌ఫ్లో ఛానెల్ ఉన్న విష‌యాన్ని స‌ద‌రు ఇంజినీర్లే స్వ‌యంగా చూపెట్టార‌ని తెలిపారు. ఇప్పుడేమో ఆ ఛానెల్ ని రోడ్డు నుంచి దారి మళ్లించార‌ని ఆరోపించారు. ఇప్పుడా ఛానెల్ ఎక్కడుందో ఆ రోడ్లన్నీ ఎటు వెళుతున్నాయో ఎవరికీ తెలియదన్నారు.

గతంలో మంసానికుంట చెరువులో ఉన్న నీళ్లన్నీ బల్కాపూర్ నాలాలోకి వెళ్లేవ‌ని.. దాన్ని కింద ఉన్న మేక‌సాని కుంట‌లోనూ నిర్మాణాల్ని చేపడుతున్నారని తెలిపారు. ఇందులోని నీళ్లన్నీ నల్ల చెరువు మీదుగా మూసీ నదిలోకి కలుస్తాయ‌ని గుర్తు చేశారు. చెరువుల్ని పూడ్చివేయడం వల్ల వర్షాలు పడితే హైదరాబాద్ నగరమంతా మునిగిపోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాబట్టి, ఈ చెరువుల్ని పునరుద్ధరించాల‌ని డిమాండ్ చేశారు. బల్కాపూర్ నాలా జన్వాడ పైనుంచి హుస్సేన్ సాగర్ వరకూ ప్రవహిస్తుంద‌ని.. అంత ప్రాచీనమైన ఈ నాలా.. ప్రతి చెరువుకి నీళ్లను అందిస్తూ న‌గ‌రంలో భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేస్తుంద‌నే విష‌యాన్ని గుర్తించాల‌న్నారు.

టీఎస్ఐఐసీ అనుమ‌తి ఎలా?

మంసానికుంట‌, మేకసాని కుంట, బ‌ల్కాపూర్ నాలాల మీద ఫినీక్స్ సంస్థ హైరైజ్ నిర్మాణం క‌ట్టేందుకు టీఎస్ఐఐసీ అనుమ‌తిని ఎలా మంజూరు చేసింద‌ని ఆమె ప్ర‌శ్నించారు. అక్కడ చెరువులుండగా అనుమతులెలా ఇస్తారని నిల‌దీశారు. ఈ దురాక్ర‌మ‌ణ‌పై 2019 సెప్టెంబరులో తాము ఫిర్యాదు చేయగా.. టీఎస్ఐఐసీ అధికారులు ఆయా నిర్మాణంలోనికి రెండుసార్లు త‌మ‌ను తీసుకువెళ్లార‌ని తెలిపారు. జేసీబీ సాయంతో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ఛానెళ్లను తెరిపించార‌ని.. 6.35 మీటర్ల వెడల్పు ఉన్న ఇన్ ఫ్లో ఛానెల్ ను పునరుద్ధిరించి బల్కాపూర్ నాలాలో కలిసేలా ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని కోరినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు. 2020 జనవరి 7న‌ మళ్లీ ఆ ప్రాజెక్టు ఆవరణలోకి టీఎస్ఐఐసీ అధికారులు తీసుకెళ్లగా ఆ ఛానెల్ ను పూర్తిగా మూసి వేసి బ‌డా నిర్మాణాన్ని క‌ట్టేశార‌ని.. అందుకే, 2020 ఫిబ్ర‌వ‌రిలో ఎన్జీటీని ఆశ్ర‌యించామ‌ని వివ‌రించారు.

ఈ అంశంపై కేసులుండగా ప్రభుత్వ సంస్థలను అనుమతుల్ని మంజూరు చేయడం ఎంతవరకూ క‌రెక్టు అని ప్ర‌శ్నించారు. సహజసిద్ధంగా ప్రవహించే చెరువులు, నాలాల్ని పూడ్చివేస్తూ.. మంచి నీటి ప్రవాహాన్నీ అడ్డుకోవ‌డం దారుణ‌మైన విష‌య‌మ‌న్నారు. స‌హ‌జంగా ల‌భించే నీళ్ల‌ను ప‌ట్టించుకోకుండా.. ఎక్కడో వంద, రెండు వందల కిలోమీటర్ల నుంచి నీళ్లు తేవడమేమిటి? అంత సొమ్ము ప్రభుత్వం ఉందా? ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి హైదరాబాద్ నగరం రానున్న రోజుల్లో ఘోస్ట్ సిటీగా అవతరించే ప్రమాదముంద‌ని హెచ్చ‌రించారు. ఇటీవల నిర్మాణం జరిగే ప్రాజెక్టు వద్దకెళితే.. ఫినీక్స్ బోర్డులను పూర్తిగా తొలగించారని.. వేరే బోర్డు కనిపిస్తోందని తెలిపారు.

స్వీయ లాభాల‌కు ప్ర‌కృతి నాశ‌న‌మా?

హైదరాబాద్లోని చెరువులు, నాలాలు ఒక్కొక్కటిగా కనుమరుగు అవుతున్నాయి. వాటిని అక్రమంగా పూడ్చివేసి కొందరు డెవలపర్లు నిర్మాణాల్ని చేపడుతున్నారు. అందుకే, ఏ చిన్న వర్షం పడినా రహదారులన్నీ గోదారులుగా మారుతున్నాయి. కాలనీలోకి నీళ్లన్నీ చొచ్చుకొస్తున్నాయి. ఫలితంగా, ఆస్తి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలకు ప్రాణహానీ ఏర్పడే ప్రమాదముంది. ఏడు జిల్లాల‌కు వ్యాపించి ఉన్న హైద‌రాబాద్‌లో ఒక‌ప్పుడు ముప్ప‌య్ వేల చెరువులుండేవి. కానీ నేడో, జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న‌వి 185 మాత్ర‌మే. మ‌రి, సొంత లాభాల కోసం ప్ర‌కృతిని వినాశ‌నం చెసే హక్కు ఎవ‌రికుంది?

ఘోస్ట్ సిటీగా మారుతుందా?

చెరువుల్ని పూర్తిగా మ‌ట్టితో నింపేసి.. వాటిని మాయం చేసి.. అపార్టుమెంట్లు, బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల్ని క‌ట్ట‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం? గత కొన్ని ద‌శాబ్దాల నుంచి చెరువుల్ని, నాలాల్ని మింగేయడం వ‌ల‌న.. ఏ చిన్న వ‌ర్షం వ‌చ్చినా న‌గ‌ర ర‌హదారుల‌న్నీ జ‌ల‌మ‌యం అవుతున్నాయి. నాలాల‌న్నీ పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, మంచినీటి నాలాల‌ను పూడ్చేస్తే.. భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోయి.. న‌గ‌రంలో నీటి కొర‌త ఏర్ప‌డి.. భవిష్య‌త్తులో హైద‌రాబాద్ ఘోస్ట్ సిటీగా అవ‌త‌రించే ప్ర‌మాద‌ముంద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles