poulomi avante poulomi avante

ప్రీలాంచ్ కేటుగాళ్లను గుర్తించడం ఎలా?

  • సుహాస్ ప్రాజెక్ట్స్ ప్రీలాంచ్ మోసం?
  • ప్రీలాంచ్ మోసాల‌కు కేరాఫ్ హైద‌రాబాద్‌!
  • ఈ కేటుగాళ్ల‌కు ఐటీ విభాగం అడ్డుక‌ట్ట వేయ‌లేదా?
  • మోస‌పూరిత ప్రాజెక్టుల్ని ట్రాక్ చేయాలి!
  • అప్పుడే బ‌య్య‌ర్లు మోస‌పోరు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరువ‌లోని తుక్కుగూడ‌లో.. భారీ షాపింగ్ మాల్‌, మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌.. ఆరు ఎక‌రాల్లో 15 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో ట్విన్ ట‌వ‌ర్లు.. రూ.10 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే.. 120 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం.. మూడు గ‌జాల యూడీఎస్ స్థ‌లం.. నెల‌కు ఐదు వేలు అద్దె.. ఇంకేముంది! మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆశ‌ల‌కు అతిపెద్ద గాలం..

మియాపూర్లో కోటి రూపాయ‌ల ఫ్లాట్.. యాభై ల‌క్ష‌ల‌కే.. కాకపోతే ముందే సొమ్ము కట్టాలన్నది కండీషన్. పేరున్న నిర్మాణ సంస్థ‌.. మూడు, నాలుగేళ్ల కళ్లు మూసుకుంటే ఫ్లాట్ చేతికొస్తుందని భావించారు. సుమారు 250 మంది వంద శాతం సొమ్ము కట్టేశారు. అదిగో.. ఇదిగో.. అంటూనే మూడేళ్లుగా ఎదురు చూపే. ఫ్లాట్ ఎప్పుడొచ్చేనా అని!

ఫ్లాట్ రేటు త‌క్కువ‌.. ఎంచ‌క్కా సొంతింట్లోకి గృహ‌ప్ర‌వేశం చేస్తామ‌ని కొంద‌రు క‌ల‌లు క‌న్నారు. నెలనెలా అద్దె ప‌క్కా.. అని ప్ర‌క‌ట‌న క‌నిపిస్తే చాలు.. అత్యాశ‌ప‌డి.. గొర్రెల్లా ఎగ‌బ‌డి చేతిలో ఉన్న సొమ్మంతా అక్ర‌మార్కుల‌ చేతిలో పోస్తున్నారు మ‌రికొంద‌రు. ఆ సంస్థ‌కు అనుభ‌వ‌ముందా? ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్ని క‌ట్టారు? అని ఆలోచించ‌ట్లేదు. పోనీ.. వీరేమైనా నిర‌క్షరాస్యులా అంటే అదీ కాదు. అయిన‌ప్ప‌టికీ రేటు త‌క్కువంటే ఆశ‌ప‌డుతున్నారు. క‌ల‌ల గృహం చేతికొస్తుంద‌ని క‌ల‌లు కంటున్నారు. రెండు, మూడేళ్లయినా నిర్మాణం ప్రారంభం కాక‌పోవ‌డంతో చాలామంది మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ, రియ‌ల్ రంగంలో కొత్త మోస‌గాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ ప్ర‌భుత్వం చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేస్తుండ‌టంతో.. పొరుగు రాష్ట్రాల‌కు చెందిన మోస‌గాళ్లంతా వ‌చ్చి హైద‌రాబాద్‌లో వాలిపోతున్నారు. కార్పొరేట్ ఆఫీసు పెట్టి.. మంచి ఉద్యోగుల్ని నియ‌మించుకుని.. ప్ర‌క‌ట‌న‌ల్ని గుప్పిస్తూ.. అమాయ‌కుల నుంచి ల‌క్ష‌లు కొల్ల‌గొడుతున్నారు. ఒక్కొక్క‌రి బాగోతం బ‌య‌ట‌ప‌డ‌టానికి ఎంతలేద‌న్నా కొంత స‌మ‌యం ప‌డుతుంది. కాక‌పోతే, అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది.

రూ.2000 కోట్ల వ‌సూళ్ల‌కు స్కెచ్‌?

సుహాస్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. నిర్మాణ రంగంలో పెద్ద‌గా అనుభ‌వం లేదు. నిర్మాణాల‌కు సంబంధించి సాంకేతిక అంశాల‌పై ప‌రిజ్ఞానమూ లేదు. అయిన‌ప్ప‌టికీ, మార్కెట్లో అంద‌రూ చేస్తున్న‌ట్లుగానే.. ఒక పెద్ద క‌మ‌ర్షియ‌ల్ స్కామ్‌కు తెర లేపింది. తుక్కుగూడ‌లో ఆరు ఎక‌రాల్లో ప‌దిహేను ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో.. షాపింగ్ మాల్‌, బిజినెస్ స్పేస్‌ను నిర్మిస్తామంటూ ప్రచారం ప్రారంభించింది. ఇందులో రూ.10 ల‌క్ష‌లు పెడితే చాలు.. 120 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం ఇస్తామ‌ని.. దానిపై ప్ర‌తినెలా ఐదు వేలు అద్దె చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇంత‌కీ ఆ స్థ‌లం ఎవ‌రిది? యాజ‌మాన్య హ‌క్కులు ఎవ‌రి పేరు మీద‌ ఉన్నాయి? అస‌లీ భూమి కోసం సుహాస్ ప్రాజెక్ట్స్ స్థ‌ల‌య‌జ‌మానికి సొమ్ము చెల్లించిందా? లేక అడ్వాన్సు చెల్లించి.. మిగ‌తా మొత్తాన్ని ఫ్రాడ్ స్కీమ్ పేరిట కొనుగోలుదారుల నుంచి వ‌సూలు చేసి చెల్లించాల‌ని స్కెచ్ వేసిందా? అనే విష‌యాలింకా తేలాల్సి ఉంది.

అస‌లీ సుహాస్ ప్రాజెక్ట్స్ సంస్థ‌కు ప‌ది ల‌క్ష‌లు చెల్లిస్తే.. ఎప్పట్నుంచి ఐదు వేలు అద్దె చెల్లిస్తారనే విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. రూ.10 ల‌క్ష‌లు క‌ట్ట‌గానే ప్ర‌తినెలా ఇస్తారా? లేక నిర్మాణం పూర్త‌య్యాక అంద‌జేస్తారా? ఇలా, 120 గ‌జాల స్థ‌లాన్ని రూ.10 ల‌క్ష‌ల చొప్పున కొంత స్థ‌లాన్ని విక్ర‌యించి.. కొన్నాళ్ల త‌ర్వాత రేటును పెంచాల‌న్న‌ది కంపెనీ భారీ ప్ర‌ణాళిక‌గా క‌నిపిస్తుంది. 1200 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని విక్ర‌యిస్తే ఈ సంస్థ చేతికి సుమారు కోటి రూపాయ‌లు వ‌స్తుంది. అంటే, 1,20,000 చద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని అమ్మితే.. సుమారు రూ.100 కోట్లు.. 10.20 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని విక్ర‌యిస్తే.. రూ.1,000 కోట్లు.. 15.20 ల‌క్ష‌ల చ.అ. స్థ‌లానికి సుమారు రూ.1500 కోట్లు చేతికొస్తుంద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం కొంత స్థ‌లాన్ని విక్ర‌యించి.. ఐదారు నెల‌ల త‌ర్వాత రూ.10 ల‌క్ష‌ల‌ను కాస్త రూ.15 ల‌క్ష‌ల‌కు పెంచితే.. ఏకంగా రూ.2000 కోట్లు వ‌సూలు చేయాల‌నే భారీ స్కెచ్ వేసిన‌ట్లు అర్థమవుతోంది.

వెబ్‌సైట్ డౌన్‌..అప్‌!

తెలంగాణ రాష్ట్రంలోనే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌గా ఎదగాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న‌ట్లుగా వెబ్‌సైటులో రాసుకుందీ సుహాస్ ప్రాజెక్ట్స్. అందుకు త‌గ్గ‌ట్టుగా హెచ్ఎండీఏ నుంచి అనుమ‌తి తీసుకుంటే ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌దు. తుక్కుగూడ‌లోని బిజినెస్ స్పేస్ షాపింగ్ మాల్ వ్య‌వ‌హారాల‌న్నీ త‌నే చూసుకుంటానని వెబ్‌సైటులో పొందుప‌ర్చిన ఈ సంస్థ ఎండీ సుజాత సామినేనికి.. ప్రీలాంచుల్లో స్థ‌లాన్ని విక్ర‌యించ‌కూడ‌ద‌న్న ఇంగితజ్ఞానం లేదా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. చేతిలో సొమ్ము లేక‌పోయినా.. హెచ్ఎండీఏ, రెరా అథారిటీల నుంచి అనుమ‌తి తీసుకోకుండా.. ప‌దిహేను ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని అక్ర‌మంగా అమ్మే ప్ర‌య‌త్నం చేయ‌డమెంత అన్యాయ‌మ‌నే విష‌యం తెలియ‌దా అంటూ నిల‌దీస్తున్నారు. ఈ సంస్థ నిర్వాకం గురించి రెజ్ న్యూస్‌లో రాసిన కొంత‌సేపటికే వెబ్‌సైటును డిలీట్ చేసిన సుహాస్ ప్రాజెక్ట్స్‌.. మ‌రుస‌టి రోజు మేనేజ్‌మెంట్ పేర్లు, ఫోటోలు లేకుండా సైటును ఆరంభించ‌డం గ‌మ‌నార్హం.

ఈ అక్ర‌మ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవ‌స‌ర‌మ‌య్యే సొమ్మును స‌మ‌కూర్చుకునేందుకు.. రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ల‌కు అధిక క‌మిష‌న్లు పేరిట ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్రమంలో ఇటీవ‌ల మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో సుమారు మూడు వందల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బడా ఈవెంట్ కూడా నిర్వ‌హించింది. షాపింగ్ మాల్‌, మ‌ల్టీప్లెక్సులో ప్ర‌జ‌ల‌తో పెట్టుబ‌డి పెట్టిస్తే.. అధిక క‌మిష‌న్ల‌ను ముట్ట చెబుతామంటూ ఏజెంట్ల‌కు ఆశ‌ల్ని రేకెత్తించింది. దీంతో, వీరు చెప్పే మాయ‌మాట‌ల్ని నిజమేన‌ని న‌మ్మి.. ఏజెంట్లు మార్కెట్లోకి రంగ‌ప్ర‌వేశం చేశారు. వీరంతా క‌లిసి అమాయక పెట్టుబ‌డిదారుల‌కు గాలం వేసే ప‌నిలో ప‌డ్డారు. ఇలాంటి మోస‌గాళ్ల‌ను ముందే గుర్తించే ప‌రిజ్ఞానాన్ని తెలంగాణ ఐటీ శాఖ అభివృద్ధి చేయాలి. మోస‌పూరిత ప్రాజెక్టుల్ని ట్రాక్ చేసే విధానాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని నియ‌మించాలి. చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకోకుండా.. తెలంగాణ ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్ని తీసుకుంటే.. రియల్ మోసగాళ్ల బారిన పడకుండా ప్రజల్ని కాపాడినట్లు అవుతుంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles