స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లలో అయినా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లోనైనా.. పాత ఫ్లాట్లను విక్రయించేటప్పుడు ఎంత రేటుకు అమ్మాలనే విషయంపై చాలామంది తర్జనభర్జన పడుతుంటారు. కొందరేమో.. అంతకు ముందు అమ్మిన రేటును ప్రాతిపదికన తీసుకుంటారు. మరికొందరేమో ఇంకా కొంచెం ఎక్కువ రేటుకు అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. అలా కాకుండా, ఒక ఫ్లాట్ విలువను శాస్త్రీయ పద్ధతిలో ఎలా నిర్థారించాలి? ఇందుకోసం ఏయే అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు?
మీరు నివసిస్తున్న ప్రాంతం, అక్కడ అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు, ఆయా ఏరియాకు గల మార్కెట్ డిమాండ్, ఫ్లాట్ నిర్వహణ, కమ్యూనిటీ నిర్వహణ, అందులోని సదుపాయాలు, సౌకర్యాల్ని నిర్వహిస్తున్న తీరు వంటి అంశాల ఆధారంగా ఫ్లాట్ తుది ధర ఆధారపడుతుంది. ప్రభుత్వం నిర్థారించే ధర మార్కెట్ రేటు కంటే ఎప్పుడూ తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. పాత ఫ్లాటు అమ్మకపు ధరను నిర్థారించేందుకు పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ప్రాతిపదికనే తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.
- అపార్టుమెంట్ ఏయే ప్రాంతంలో ఉంది? అది నివాస ప్రాంతమా? వాణిజ్య స్థలమా? లేదా బహుళ వినియోగంలో ఉందా?
- అపార్టుమెంట్ కట్టిన సంవత్సరమేంటి? ఎంత పాతది? ఎన్ని అంతస్తులు? స్ట్రక్చర్ రకం, ఫ్లాట్ల సంఖ్య వంటివి గమనిస్తారు.
- నిర్మాణ నాణ్యత ఎలా ఉంది? చూడటానికి ఎలా కనిపిస్తుంది? అందవికారంగా ఉందా?
- ఆయా అపార్టుమెంట్ మెయిటనెన్స్ ఎలా ఉంది? నివాస సంఘం మెరుగ్గానే నిర్వహిస్తుందా? అందులోని సదుపాయాలు, సౌకర్యాలు, లిఫ్టు సదుపాయం వంటివి ఉన్నాయా?
- మంచినీటి సరఫరా, డ్రైనేజీ సదుపాయం, కార్ పార్కింగ్, అపార్టుమెంట్ చుట్టూ గోడ ఉందా?
ఫ్లాట్ ఎక్కడుంది?
అమ్మాలనుకునే ఫ్లాట్ ఏయే అంతస్తులో ఉంది? ఫ్లోరింగ్, తలుపులు, కిటీకీలు, ఫిట్టింగులు, ఫినిషింగ్ వంటివి పక్కాగా గమనిస్తారు. ఫ్లాట్ నిర్వహణను నిశితంగా పరిశీలిస్తారు.
సులువుగా అమ్ముడవుతుందా?
ప్రస్తుతం ఫ్లాట్ కొనేవారు.. కొన్నాళ్ల తర్వాత అమ్ముకోవాల్సి వస్తే.. సులువుగా విక్రయించగల్గుతారా? ఈ అంశం కీలకమే. ఆయా ప్రాంతం సమీపంలోని రెసిడెన్షియల్, వాణిజ్య ప్రాంతాలున్నాయా? ఇందుకు సంబంధించిన నెగటివ్ అంశాలుంటే పరిగణనలోకి తీసుకుంటారు.
రేటు ఎలా నిర్ణయిస్తారు?
మీరు చెబుతున్న స్పెసిఫికేషన్లతో.. మీ అపార్టుమెంట్ చుట్టుపక్కల కమ్యూనిటీల్లో రేటెంత చెబుతున్నారో గమనిస్తారు. ఒకవేళ, కొత్త అపార్టుమెంట్ అయితే, అందులోని సదుపాయాలు, సౌకర్యాలతో ఎంత రేటుకు అమ్ముతున్నారో చూస్తారు.
డిప్రిసీయేషన్ ఎంత?
నిర్మాణం ఎంత పాతది? ఆయా అపార్టుమెంట్ ఎంతకాలం మన్నికగా ఉంటుంది? డిప్రిసీయేషన్ శాతాన్ని సాధారణంగా 10 శాతం నుంచి లెక్కిస్తారు. పదేళ్లకు పైగా కమ్యూనిటీలు, మెరుగైన నిర్వహణ వంటివి ఉంటే తరుగుదల 15 శాతంగా నిర్ధారిస్తారు.