నోయిడా అక్రమ టవర్ల కూల్చివేత ఫ్లాట్ యజమానులు సాధించిన గొప్ప విజయం అని ఇళ్ల కొనుగోలుదారుల సంస్థ.. ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (ఎఫ్ పీసీఈ) అభివర్ణించింది. అక్రమ టవర్లు ఒక్కటే కాదు.. బిల్డర్లు, డెవలప్ మెంట్ అథార్టీ ఈగో కూడా నేలమట్టమైందని వ్యాఖ్యానించింది. ‘భవనాలు నేలమట్టం కావడాన్ని చూసిన తర్వాత.. భవనాలు ఒక్కటే నేలమట్టం కాలేదు, బిల్డర్, అధికారుల ఈగో కూడా నేలమట్టమైందని అనిపించింది’ అని ఎఫ్ పీసీఈ అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. అయితే, దురదృష్టవశాత్తు నోయిడా అథార్టీలో దీనికి కారకులు ఎవరో సుప్రీంకోర్టు సైతం గుర్తించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే బిల్డర్ల తరఫున తెరవెనుక ఎవరి ఒత్తిడి అధకారులపై పని చేసిందో కూడా కని పెట్టి ఉండాల్సిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తాజా తీర్పుతో అంగ బలం, అర్థ బలం ఇకపై కొనుగోలుదారులను భయపెట్టే పరిస్థితి లేదనేది అర్థమవుతోందన్నారు. అయితే, ఇలా భవనాలను నేలమట్టం చేయడం వల్ల భారీగా ఆర్థిక నష్టం కలగడంతోపాటు పర్యావరణ, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని అభయ్ పేర్కొన్నారు. అందువల్ల ఇలాంటి అవకతవకలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడం ద్వారా మాత్రమే అడ్డుకోవచ్చన్నారు.