- సూపర్ టెక్ యోచన
- వ్యతిరేకిస్తున్న ఎమరాల్డ్ కోర్టు రెసిడెంట్స్ అసోసియేషన్
సుప్రీంకోర్టు ఆదేశాలతో నోయిడాలో కూల్చివేసిన ట్విన్ టవర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టు చేపట్టడానికి సూపర్ టెక్ సిద్ధమవుతోంది. ఎమరాల్డ్ కోర్టు లో ఉన్న జంట టవర్లను అక్రమంగా నిర్మించిన నేపథ్యంలో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. అయితే, ఆ భూమి యాజమాన్య హక్కులు సూపర్ టెక్ కి ఉన్న నేపథ్యంలో అక్కడ కొత్త హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టాలని ఆ కంపెనీ భావిస్తోంది. శిథిలాల తొలగింపు పూర్తయిన తర్వాత అక్కడ కొత్త హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టడానికి వీలుగా అనుమతి తీసుకుంటామని సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా వెల్లడించారు. ‘ఆ భూమి మాకు చెందిందే. త్వరలోనే భవన నిబంధనల మేరకు హౌసింగ్ ప్రాజెక్టు ప్లాన్ రూపొందించి దానిని నోయిడా అథార్టీకి సమర్పిస్తాం.
దీనికి ఎమరాల్డ్ కోర్టు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుమతి అవసరమైతే, అది కూడా తీసుకుంటాం’ అని చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఎమరాల్డ్ కోర్టు అసోసియేషన్ తో మరో సమరానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. ట్విన్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ ఏరియాగా చేయాల్సి ఉంది. అయితే, అక్కడ మళ్లీ నిబంధనల మేరకు రెసిడెన్షియల్ ప్రాజెక్టు చేపడతానని చెబుతుండటంతో మళ్లీ వివాదం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ట్విన్ టవర్ల కూల్చివేతకు సూపర్ టెక్ పై దశాబ్ద కాలం పోరాడిన ఎమరాల్డ్ కోర్టు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యూబీఎస్ తోతియా దీనిపై స్పందించారు. ట్విన్ టవర్ల భూమిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాన్ని ఎమరాల్డ్ కోర్టు నివాసితులు నిర్ణయిస్తారని, సూపర్ టెక్ కాదని పేర్కొన్నారు. ‘ఈ భూమి మాకు చెందింది. మా అనుమతి లేకుండా డెవలపర్ అక్కడ ఏమీ చేయడానికి వీల్లేదు’ అని స్పష్టంచేశారు. త్వరలోనే ఎమరాల్డ్ కోర్టు నివాసితులందరితో సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని, ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును తమ అసోసియేషనే భరిస్తుందని తెలిపారు.