poulomi avante poulomi avante

బెంగ‌ళూరును చూసి.. మ‌న‌మేం నేర్చుకోవాలి?

ఒక్కో విల్లాను సుమారు రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇంటి ముందు ఖ‌రీదైన కార్లే. కానీ, ఒక్క రోజు కురిసిన వ‌ర్షంతో అవ‌న్నీ నీట మునిగాయి. ఆ ప్రాజెక్టు మొత్తం నీళ్ల‌తో నిండిపోయింది. అందులో నివ‌సించేవారు బ‌య‌టికి రాలేక.. ఇంట్లో ఉండ‌లేక.. ఎటు చూసినా నీళ్లే క‌నిపించ‌డంతో.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీశారు. నిత్యం బ‌డా కార్ల‌లో తిరిగేవారు.. ఆయా ల‌గ్జ‌రీ విల్లాల నుంచి బ‌య‌టికి వ‌చ్చేందుకై ట్రాక్ట‌ర్ల‌ను ఎక్కాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. అస‌లెందుకీ దారుణ‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది? మ‌న న‌గ‌రంలోనూ గ‌తంలో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా.. ట్రిపుల్ వ‌న్ జీవో ప‌రిధిలో ఉన్న కొన్ని విల్లా క‌మ్యూనిటీలు నీట మునిగాయి. అకాలంగా కురిసే వాన‌ల నుంచి హైద‌రాబాద్ ఎదురొడ్డి నిల‌బ‌డాలంటే ఇప్ప‌టికైనా ఏం చేయాలి?

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల వ‌ల్ల మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో నివ‌సించేవారు దారుణంగా ఇబ్బంది ప‌డ్డారు. న‌గ‌రంలోనూ వ‌ర్షం కురిస్తే చాలు ఎక్క‌డిక‌క్కడ నీళ్ల‌న్నీ నిలిచిపోయి ప్ర‌జ‌లు తీవ్ర ఇక్క‌ట్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ చెరువులు, నాలాల‌ను క‌బ్జా చేసి అపార్టుమెంట్లు, విల్లా క‌మ్యూనిటీల‌ను క‌ట్ట‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణమ‌ని ప్ర‌తిఒక్క‌రికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ, అటు అధికారులు కానీ ఇటు ప్ర‌జాప్ర‌తినిధులు కానీ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఎందుకంటే, అలా చెరువులు, నాలాలు క‌బ్జా చేసిన వారిలో చాలామంది రాజ‌కీయ నాయకులు కావ‌డం మ‌న దౌర్భాగ్యం.

కొన్ని ద‌శాబ్దాలుగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ పెరిగి దాదాపు స‌గానికి పైగా చెరువులు క‌నుమ‌రుగ‌య్యాయి. అధిక శాతం దురాక్ర‌మ‌ణ‌కు గుర‌య్యాయి. అందుకే, ఎప్పుడు వ‌ర్షం ప‌డినా ఇందులోకే వ‌ర్ష‌పు నీళ్లు వ‌చ్చి చేరుతున్నాయి. కాంక్రీటు శాతం పెరిగే కొద్దీ ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక ఉప‌యోగంలో లేకుండా పోతుంది. బహిర్గతమైన భూ ఉపరితలాలు లేకపోవడం వల్ల భూమిలోకి నీరు తిరిగి ప్రవహించదు. అందుకే, భూగ‌ర్భ‌జ‌లాలు అడుగంటి పోయి వేస‌విలో నీరు దొరక్క ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

వాస్త‌వానికి వ‌ర్షం ప‌డిన ప్ర‌తీసారి వ‌ర‌ద నీటి కాల్వ‌ల ద్వారా చెరువుల్లోకి నీరు ప్ర‌వ‌హించేవి. అక్క‌డ్నుంచి నీళ్ల‌న్నీ భూమిలోకి ఇంకిపోయేవి. కానీ, ఇప్పుడా ప‌రిస్థితి లేదు. మురుగునీటి డంపింగ్‌, నిర్మాణాలు, కూల్చివేత‌ల డంపింగ్ వంటి వాటితో చెరువులు, వ‌ర‌ద నీటి కాల్వ‌ల‌న్నీ దురాక్ర‌మ‌ణ‌కు గుర‌య్యాయి. ఫ‌లితంగా నీళ్ల‌న్నీ వీధుల్లోకి, ప్ర‌జ‌ల ఇళ్ల‌ల్లోకి ప్ర‌వ‌హిస్తున్నాయి. హైద‌రాబాద్‌లో నేటికీ నిజాం న‌వాబు క‌ట్టించిన డ్రైనేజీ వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంది. అధికారంలోకి వ‌చ్చిన అనేక ప్ర‌భుత్వాలు ఈ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించ‌లేదు. అమీర్ పేట్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, నిజాంపేట్‌, హ‌ఫీజ్‌పేట్‌, మూసాపేట్‌, కూక‌ట్‌ప‌ల్లి, మ‌ణికొండ‌, పొప్పాల్‌గూడ‌, మాదాపూర్‌, ఖైర‌తాబాద్‌, రామాంతపూర్‌, అంబ‌ర్‌పేట్‌, దిల్‌సుక్‌న‌గ‌ర్‌, నాగోలు వంటి ప్రాంతాల‌న్నీ కాంక్రీటు జంగిల్లా మారాయి. శివార్ల‌లో నేటికీ మురుగునీటి వ్య‌వ‌స్థ అందుబాటులోకి రాలేదు.

ఇప్పుడేం చేయాలి?

సుస్థిర‌మైన రీతిలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలి. వ‌ర‌ద నీటి కాల్వ‌ల‌పై క‌ట్టిన అపార్టుమెంట్ల‌ను నేల‌మ‌ట్టం చేయాలి. దీంతో వ‌ర‌ద నీరు సజావుగా ప్రవహిస్తుంది. అన్ని చెరువుల‌ మధ్య అనుసంధానం మెరుగవుతుంది. హైద‌రాబాద్‌లో ప‌లువురు బిల్డ‌ర్లు చెరువుల్ని క‌బ్జా చేసి క‌ట్టిన నిర్మాణాల్ని కూల్చివేయాలి. అడ‌పాద‌డ‌పా హెచ్ఎండీఏ అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చ‌వేయ‌డాన్ని ఆరంభించి.. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి అర్థాంత‌రంగా మ‌ధ్య‌లో నిలిపివేసేది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీకి వెళ్లే వంద ఫీట్‌ రోడ్డులో గల చెరువును కొందరు కబ్జాకోరులు రాళ్లు, మట్టితో నింపివేశారు. అధికారులు కళ్లు తెరవకపోతే.. ఇక్కడా అతి పెద్ద‌ అపార్టుమెంట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మియాపూర్లో గుర్నాధం చెరువు ఆనుకుని ఒక గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం జరుగుతోంది. బయట్నుంచి చూస్తే.. ఈ నిర్మాణం చెరువులోనే కడుతున్నట్లు కనిపిస్తుంది. కాకపోతే, సదరు డెవలపర్ మాత్రం చెరువులో కట్టడం లేదంటున్నారు. కానీ, స్థానికులు మాత్రం చెరువులోనే అపార్టుమెంట్ కడుతున్నారని.. వర్షాలు పెరిగితే ఇందులోని సెల్లారులోకి నీళ్లు వచ్చేస్తాయని చెబుతున్నారు.

రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్‌?

ప్ర‌తి అపార్టుమెంట్‌లో రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్‌ని బిల్డ‌ర్లు ఏర్పాటు చేసి స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి. వ్య‌క్తిగ‌త ఇళ్ల‌ను క‌ట్టేవారూ ఈ నిబంధ‌న‌ను త‌ప్ప‌కుండా పాటించాలి. ఎవ‌రికి వారే ఈ నిబంధ‌న‌ను ప‌క్కాగా పాటించిన‌ప్పుడే భూగ‌ర్భ‌జ‌లాలు పెరుగుతాయి. ఇలా నివాసితులంతా వాన నీటిని ఒడిసి ప‌ట్టుకుంటే.. చిన్న అవస‌రాల కోసం వాడుకోవ‌చ్చు. ప్ర‌జ‌లు వాన నీటి గుంత‌ల్ని ఏర్పాటు చేసుకోవాల‌ని స్థానిక సంస్థ‌లు ప్రోత్స‌హించ‌డం మానివేశాయి. హైద‌రాబాద్‌లో ఈ నిబంధ‌న‌ను ప్ర‌తిఒక్క‌రూ పాటిస్తున్నారా? లేదా? అనే అంశంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించ‌ట్లేదు.

111 జీవో ఏరియాలో ఇప్ప‌టికే అక్ర‌మ నిర్మాణాల సంఖ్య పెరిగింది. కొంద‌రు బిల్డ‌ర్లు అనుమ‌తుల్లేకుండా ల‌గ్జ‌రీ విల్లాలు, గేటెడ్ క‌మ్యూనిటీల‌ను నిర్మించారు. దీంతో, వ‌ర్షం ప‌డిన ప్ర‌తీసారి వీటిలో అధిక శాతం నీట మునుగుతున్నాయి. ఇక‌, ఇందులో అపార్టుమెంట్లు, విల్లాల్ని క‌ట్టేందుకు అనుమ‌తినిస్తే.. హైద‌రాబాద్ కూడా బెంగ‌ళూరు, ముంబై త‌ర‌హాలో నీట మున‌గ‌డం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు. అందుకే, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు జీవో నెం 69ని ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్‌ని సైతం కోరిన విష‌యం తెలిసిందే.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles