కొన్ని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కుక్కలకు సంబంధించి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కుక్కలు రాత్రిపూట అరుస్తున్నాయని.. తమకు నిద్రాభంగం కలుగుతుందని కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. మరికొందరేమో పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో కుక్కలను లిఫ్టులోకి అనుమతించకూడదని వాదనకు దిగుతుంటారు. నివాసితుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు నివాస సంఘాలు కుక్కలపై నియంత్రణ విధించేందుకు ప్రయత్నించినప్పుడల్లా పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. ఈ క్రమంలో అపార్టుమెంట్‌లో పొరపాటున శునకం కరిచినా.. గాయపర్చినా.. చట్టప్రకారం ఎలాంటి చర్యల్ని తీసుకోవచ్చు?
పెంపుడు కుక్క ఒక వ్యక్తిని కరిచినా లేదా గాయపరిచినా ఐపీసీ సెక్షన్లు 287, 337 కింద క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. కాకపోతే, దీన్ని సాకుగా చూపెట్టి.. నివాస సంఘాలు తమకు ఇష్టం వచ్చినట్లుగా నియమాల్ని రూపొందించకూడదు. వ్యక్తులు మరియు ఆస్తిని సంరక్షించడానికి సహేతుకమైన నిర్ణయం తీసుకుంటే మంచిది. నివాసితుల హక్కులను ఉల్లంఘించేలా.. పెంపుడు జంతువుపై నిషేధం, కుక్కను లిఫ్ట్ లను ఉపయోగించకూడదు వంటి నిబంధనల్ని ఏర్పాటు చేయకూడదు.