- జి ప్లస్ 15 అంతస్తులు..
- చదరపు అడుక్కీ రూ.2499 మాత్రమే
- ముందే వంద శాతం సొమ్ము కట్టాలి
- పుట్టగొడుగుల్లా వస్తున్న ప్రీలాంచ్‌లు
- నిద్రపోతున్న రెరా అథారిటీ?
సూపర్ టెక్ కంపెనీ అంటే మనదేశంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఈ సంస్థ నొయిడాలో అక్రమంగా కట్టిన ట్విన్ టవర్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా కట్టే నిర్మాణాల్ని కూల్చివేస్తామని దేశంలోని బిల్డర్లందరికీ సుప్రీం కోర్టు ఈ ఉదంతం ద్వారా తెలియజేసింది. అయితే, తాజాగా నగరంలోకి సూపర్ టెక్ అనే పేరుతో ఓ సంస్థ రంగప్రవేశం చేసింది. ఈ కంపెనీ తాజాగా ప్రకటించిన ఆఫర్ చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే.
పటాన్‌చెరులోని రుద్రారం వద్ద సాధారణంగా ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.5000 దాకా పెట్టాల్సిందే. కాకపోతే, ఈ సంస్థ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ.. చదరపు అడుక్కీ రూ.2499కే ఫ్లాట్లను అందజేస్తానని చెబుతోంది. అదెలాగంటే.. ముందు వంద శాతం పేమెంట్ కడితేనే సుమా! సహజంగా ఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులోనైనా ఎమినిటీస్ మరియు కార్ పార్కింగ్ కోసం ఎంతలేదన్నా రూ.8 లక్షల దాకా వసూలు చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం అలాంటిదేం లేదు. ఈ రెండూ ఉచితమేనట. అంటే డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కేవలం రూ.27.50 లక్షల్లోనే వచ్చేస్తుందన్నమాట. మరి, జి ప్లస్ 15 అంతస్తుల్లో గేటెడ్ కమ్యూనిటీని నిర్మించేందుకు ఎంత ఖర్చిస్తుందో ఈ సంస్థకు బాగా తెలిసినట్లుంది. ఆ చిదంబర రహస్యమేంటో చెబితే.. తోటి బిల్డర్లు కూడా పాటిస్తారు కదా.. తద్వారా హైదరాబాద్‌లో అతి చౌక ధరకే సామాన్యులకు ఫ్లాట్లు లభిస్తాయి. పైగా, సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసినట్లు అవుతుంది.