- ఎలాగైనా ప్రిలాంచ్ చేస్తాం
ఎవరేం చేస్తారో చూస్తాం! - రెచ్చిపోతున్న ప్రీ లాంచ్ డెవలపర్లు
- ఎప్పటిలాగే చోద్యం చూస్తున్న ‘రెరా’
తెలంగాణ రెరా అథారిటీ కళ్లు మూసుకోవడం వల్ల అక్రమ డెవలపర్లు పెట్రేగిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లు ప్లాట్లు, ఫ్లాట్లను అమ్ముతున్నారు. లేఅవుట్లు వేయడం.. అపార్టుమెంట్లను కట్టడం తర్వాతి మాట.. ముందైతే మాయమాటలు చెప్పి.. అమాయకుల నుంచి సొమ్ము వసూలు చేసేస్తున్నారు. ఆతర్వాత బుద్ధి పుడితే కడతారు. లేకపోతే మూడు నాలుగేళ్ల పాటు మీ సొమ్మును వడ్డీలకు తిప్పుకుని.. కొత్త కార్లు కొనుక్కుని.. విదేశాల్లో విహరించి.. కొంత మొత్తంతో భూముల్ని కొనుగోలు చేసి.. మూడు, నాలుగేళ్ల తర్వాత మీ సొమ్మును మీకు విడతలవారీగా విచ్చేస్తే.. మహా అద్భుతమని చెప్పొచ్చు. ఒక సంస్థ పటాన్చెరులోని ఇస్నాపూర్లో ప్రీలాంచ్ ప్రాజెక్టును ఆరంభించి ఫ్లాట్లను అతివేగంగా అమ్ముతోంది.
సూపర్ టెక్ కంపెనీ అంటే మనదేశంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఈ సంస్థ నొయిడాలో అక్రమంగా కట్టిన ట్విన్ టవర్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా కట్టే నిర్మాణాల్ని కూల్చివేస్తామని దేశంలోని బిల్డర్లందరికీ సుప్రీం కోర్టు ఈ ఉదంతం ద్వారా తెలియజేసింది. అయితే, తాజాగా నగరంలోకి సూపర్ టెక్ అనే పేరుతో ఓ సంస్థ రంగప్రవేశం చేసింది. ఈ కంపెనీ తాజాగా ప్రకటించిన ఆఫర్ చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే.
పటాన్చెరులోని రుద్రారం వద్ద సాధారణంగా ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.5000 దాకా పెట్టాల్సిందే. కాకపోతే, ఈ సంస్థ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ.. చదరపు అడుక్కీ రూ.2499కే ఫ్లాట్లను అందజేస్తానని చెబుతోంది. అదెలాగంటే.. ముందు వంద శాతం పేమెంట్ కడితేనే సుమా! సహజంగా ఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులోనైనా ఎమినిటీస్ మరియు కార్ పార్కింగ్ కోసం ఎంతలేదన్నా రూ.8 లక్షల దాకా వసూలు చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం అలాంటిదేం లేదు. ఈ రెండూ ఉచితమేనట.
అంటే డబుల్ బెడ్రూం ఫ్లాట్ కేవలం రూ.27.50 లక్షల్లోనే వచ్చేస్తుందన్నమాట. మరి, జి ప్లస్ 15 అంతస్తుల్లో గేటెడ్ కమ్యూనిటీని నిర్మించేందుకు ఎంత ఖర్చిస్తుందో ఈ సంస్థకు బాగా తెలిసినట్లుంది. ఆ చిదంబర రహస్యమేంటో చెబితే.. తోటి బిల్డర్లు కూడా పాటిస్తారు కదా.. తద్వారా హైదరాబాద్లో అతి చౌక ధరకే సామాన్యులకు ఫ్లాట్లు లభిస్తాయి. పైగా, సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసినట్లు అవుతుంది. కాబట్టి, ఇప్పటికైనా ఇలాంటి మోసపూరిత ప్రాజెక్టులో అపార్టుమెంట్లను కొనుగోలు చేయకపోవడమే అన్నివిధాల మంచిది. రెరా అనుమతి లభించాక.. మీరు ఫ్లాట్లను కొంటే.. మీ కష్టార్జితానికి ఎలాంటి ఢోకా ఉండదు.