అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) క్లెయిమ్ చేస్తున్నారా? గృహ రుణం తీసుకుని ఇల్లు కొని దానిని అద్దెకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఈ పరిస్థితిలో ఆదాయపు పన్ను ప్రయోజనాల కింద అద్దె నుంచి పూర్తి వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చా? హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడాన్ని కొనసాగించవచ్చా?
ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణంపై వడ్డీకి సెక్షన్ 24 (బి) కింద ఏడాదికి రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇది ఆ ఇంట్లో సొంతంగా నివసిస్తున్నప్పుడు వర్తిస్తుంది. ఒకవేళ దానిని అద్దెకు ఇస్తే.. సెక్షన్ 24 (బి) కింద మొత్తం వడ్డీని పూర్తిగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అద్దె ఇంటికి సంబంధించి పూర్తి వడ్డీని క్లెయిమ్ చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ.. ‘ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం’ కింద రూ.2 లక్షల వరకు పరిమితి ఉంది. దీనిని అదే ఏడాది ఇతర ఆదాయం కింద సెటాఫ్ చేయొచ్చు. ఆ ఏడాది తీసుకోని మొత్తాన్ని ఇంటి ఆస్తి ఆదాయం కింద తదుపరి ఎనిమిదేళ్లలో సెటాఫ్ చేసుకోవచ్చు. ఇక హెచ్ఆర్ఏకి సంబంధించిన పన్ను ప్రయోజనానికి వస్తే మీరు ఉంటున్న లేదా మీ సొంతం కాని ఇంటికి సంబంధించి మీరు అద్దె చెల్లిస్తున్నంత వరకు, మీరు ఏదైనా నివాస ఆస్తిని కలిగి ఉన్నప్పటికీ, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎన్నార్వో ఖాతా నుంచి పెట్టుబడులు పెట్టినందున మ్యూచువల్ ఫండ్ లలోని పెట్టుబడి రిడెంప్షన్ రాబడి ఎన్నార్వో ఖాతాలో మాత్రమే క్రెడిట్ అవుతుంది. ఎన్నార్వో ఖాతా నుంచి ఎన్నార్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయడం లేదా విదేశాలకు నిధులను పంపడంపై ఆర్బీఐ కొన్ని పరిమితులు విధించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఆర్బీఐ నుంచి ఎలాంటి నిర్దిష్టమైన అనుమతి లేకుండా ఓ ఎన్నారై ఓ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా పది లక్షల డాలర్ల వరకు మీ ఎన్నార్వో ఖాతా నుంచి ఎన్నార్ఈ ఖాతాకు బదిలీ చేయొచ్చు. ఇప్పుడు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తం పది లక్షల డాలర్లకు మించడం లేనందున మీకు నిర్దిష్ట అనుమతి అవసరం లేదు. అయితే, ఎన్నార్వో ఖాతా నుంచి ఎన్నార్ఈ ఖాతాకు మొత్తాన్ని బదిలీ చేయడానికి, ఎన్నార్వో ఖాతా నుంచి ఎన్నార్ఈ ఖాతాకు బదిలీ చేసే డబ్బుకు సంబంధించి పన్నులు చెల్లించామని ధృవీకరిస్తూ చార్డర్డ్ అకౌంటెంట్ నుంచి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ నంబర్ 15 సీబీలో జారీ చేసినందున అటువంటి బదిలీ కోసం ఫారమ్ నెంబర్ 15సీఏలో దరఖాస్తు చేయాలి. మ్యూచువల్ ఫండ్ హౌస్ ద్వారా పన్ను తీసివేస్తారు కాబట్టి ఎలాంటి అదనపు పన్ను బాధ్యత ఉండదు.