-
లిక్కర్ స్కాంలో.. అరబిందో రియాల్టీ ఎండీ శరత్ రెడ్డి అరెస్టు
-
మాదాపూర్, కొండాపూర్లో భారీ ప్రాజెక్టులను చేపట్టిన అరబిందో
-
కొహినూర్, రీజెంట్, పెరల్ ఆకాశహర్మ్యాలు
-
సుమారు నాలుగు వేలకు పైగా ఫ్లాట్ల నిర్మాణం
-
రాయదుర్గంలో రెండు వాణిజ్య నిర్మాణాలు
-
గెలాక్సీ, ఆర్బిట్ మొత్తం 3.15 మిలియన్ చ.అ.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి అరెస్టు కావడంతో.. సంస్థ షేరు విలువ గణనీయంగా పడిపోయింది. మరి, ఆయన అరబిందో రియాల్టీ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారనే విషయం నేటికీ చాలామందికి తెలియకపోవచ్చు. శరత్ రెడ్డిని ఈడీ అరెస్టు చేయడంతో.. అరబిందో రియాల్టీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, అరబిందో రియాల్టీ హైదరాబాద్ రియల్ రంగంలో కొంతకాలం నుంచి తమ ప్రత్యేకతను చాటి చెబుతున్న విషయం తెలిసిందే. మాదాపూర్ మరియు కొండాపూర్లో.. కొహినూర్, రీజెంట్, పెరల్ వంటి ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తుండటంతో.. అనేకమంది ఔత్సాహిక కొనుగోలుదారులు ఆయా ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడీ సంస్థ ఎండీని అరెస్టు చేయడంతో.. దాదాపు ఐదు ప్రాజెక్టుల భవితవ్యం గురించి ప్రశ్నార్థకం ఏర్పడింది.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో అరబిందో రియాల్టీ తన ప్రత్యేకతను చాటి చెప్పింది. అంతర్జాతీయంగా పేరెన్నిక గల ఆర్కిటెక్ట్ చాప్మాన్ అండ్ టేలర్ మాదాపూర్లోని కొహీనూర్ ప్రాజెక్టుకు ఆర్కిటెక్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని సుమారు 12 ఎకరాల్లో 42 అంతస్తుల ఎత్తులో అరబిందో రియాల్టీ నిర్మిస్తోంది. కొండాపూర్లో 12.3 ఎకరాల్లో నిర్మిస్తున్న రీజెంట్ ప్రాజెక్టును 39 అంతస్తుల్లో కడుతోంది. పెరల్ హై ఎండ్ ప్రాజెక్టును మాదాపూర్లోనే చేపడుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల్లో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య సుమారు నాలుగు వేల దాకా ఉంటాయని సమాచారం. ఈ నివాస సముదాయాల విలువ ఎంతలేదన్నా నాలుగు వేల కోట్ల దాకా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి, ఎవరూ ఊహించని రీతిలో అరబిందో రియాల్టీ ఎండీ శరత్ రెడ్డి అరెస్టు కావడంతో.. ఈ నివాస సముదాయాల నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై కొందరు కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. తమ సొమ్ము బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వాణిజ్య సముదాయాలూ..
శరత్ రెడ్డి సారధ్యంలోని అరబిందో రియాల్టీ సంస్థ.. రాయదుర్గంలో గెలాక్సీ అనే వాణిజ్య సముదాయాన్ని సుమారు 1. 9 మిలియన్ చదరపు అడుగుల్లో కడుతోంది. అర్బిట్ అనే మరో ఐటీ సముదాయాన్ని సుమారు 1. 25 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. అసలే మార్కెట్ నుంచి మద్ధతు లేకపోవడంతో ఐటీ, వాణిజ్య స్థలానికి గిరాకీ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, అరబిందో రియాల్టీ ఎండీ అరెస్టు కావడంతో ఈ రెండింటిపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇప్పటికే యూరప్ ను ఆర్థిక మాంద్యం తలకిందులు చేస్తోంది. అమెరికాలోనూ మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయి. పేరెన్నిక గల ఐటీ సంస్థలే ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. పైగా, హైదరాబాద్లో సుమారు ఇరవై వేల కోట్ల చదరపు అడుగుల్లో ఐటీ, వాణిజ్య సముదాయాల నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అరబిందో సంస్థ చేపట్టిన రెండు వాణిజ్య సముదాయాల్ని ఏయే సంస్థలు తీసుకుంటాయనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
బీజేపీ అధికారంలోకి వస్తే?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న రాజకీయ పోరు ఎప్పుడు పూర్తవుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లోనే క్లారిటీ లేదు. వచ్చే ఏడాది కేంద్రంలో మళ్లీ భాజపా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే విషయం తెలిసిందే. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో.. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు పలికే కంపెనీలకు చుక్కలు చూపిస్తారన్న విషయం విదితమే. కాబట్టి, ఎలా చూసినా అరబిందో రియాల్టీ సంస్థకు ఇబ్బందులు తప్పవనే విషయం అర్థమవుతోంది.
ఇదే నిజమైతే, ఈ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమవుతుంది? ప్రస్తుతం జోరుగా నిర్మాణాలు జరుగుతున్న అరబిందో ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదముందా? టీఆర్ఎస్ పార్టీకి ఉడతాభక్తి సాయం చేసినందుకు అరబిందో రియాల్టీ సంస్థ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందా? ఇందులో కొన్నవారి పరిస్థితి ఆగమ్యగోచరమేనా? ఇందులో ఫ్లాట్లు కొన్నవారు సంస్థ ఎండీ అరెస్టు కావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి, అరబిందో రియాల్టీ సంస్థ ఎండీ శరత్ రెడ్డి అరెస్టు అరబిందో రియాల్టీ ప్రాజెక్టులపై ఏమేరకు ఉంటుందనే విషయం తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.