- రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
- టీఎస్పీఏ వద్ద మెట్రో పనులకు శంకుస్థాపన
న్యూయార్క్, లండన్, పారిస్లో కరెంటు పోతుందేమో కానీ హైదరాబాద్లో మాత్రం విద్యుత్తు పోయే ప్రసక్తే లేదు.. ఎందుకంటే తెలంగాణను పవర్ ఐల్యాండ్గా తీర్చిదిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శుక్రవారం మెట్రో రైలు పనులకు శంకుస్థాపన అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఏర్పాటు సభలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనల్ని సడలించి నగరంలో నలభై, అరవై అంతస్తుల ఆకాశహర్మ్యాలకు అనుమతుల్ని మంజూరు చేస్తున్నామని అన్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడానికి మెట్రో రైలు చాలా అవసరమన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి కలిసేలా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి ఈ మెట్రో రైలుకు కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా.. లేకున్నా.. భవిష్యత్తులో ఈ సౌకర్యాన్ని కలిగించుకుంటామని చెప్పారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక విజయాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో మౌలిక వసతుల్ని సాధించాలని.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్లో పచ్చదనం పెంపొందించినందుకు ఆయన చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను ప్రత్యేకంగా ప్రశంసించారు.