ప్రతి మూడు నెలలకు ఓసారి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అప్ డేట్ చేయనందుకు 18 వేల మంది బిల్డర్లకు షోకాజ్ నోటీసులను రెరా జారీ చేసింది. రెరా చట్టం సెక్షన్ 11 ప్రకారం రెరాలో రిజిస్టర్ చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన సమస్త వివరాలను ప్రతి మూడు నెలలకు ఓసారి అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, పలువురు బిల్డర్లు వాటిని నమోదు చేయకపోవడంతో మహారాష్ట్ర రెరా చర్యలకు ఉపక్రమించింది.
దాదాపు 18 వేల మంది బిల్డర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు దాదాపు 2వేల మంది బిల్డర్లకు నోటీసులిచ్చింది. మిగిలినవారికి ఈ నెలాఖరులోగా జారీ చేయనుంది. తొలుత ఆటో జెనరేటెడ్ ఈ మెయిల్స్ పంపించామని.. కానీ వాటికి ఎవరూ స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని రెరా అధికారి ఒకరు తెలిపారు. ఆ నోటీసులు అందుకున్న నెల రోజుల్లోగా వారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ 18వేల ప్రాజెక్టులు ముంబై, పుణె, థానె, నాగ్ పూర్ లోనే ఎక్కువగా ఉన్నాయని వివరించారు.