రియల్ ఎస్టేట్ లో సూపర్ లగ్జరీ లావాదేవీలకు డిమాండ్ తగ్గనుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర రెసిడెన్షియల్ ప్రాపర్టీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేపిటల్ గెయిన్స్ పై పన్ను మినహాయింపును రూ.10 కోట్లకు పరిమితి చేయడమే ఇందుకు కారణమని అంటున్నారు.
ఆదాయపన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 54, 54 ఎఫ్ అనేవి ఇళ్లు, ఈక్విటీ, బాండ్లు, బంగారం, నివాస ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే సొమ్ముతో పెట్టిన పెట్టుబడి వంటి మూలధన ఆస్తుల అమ్మకాలకు వర్తిస్తాయి. గతంలో దీనికి సంబంధించి ఎలాంటి పరిమితీ ఉండేది కాదు. తాజా బడ్జెట్ లో ఈ పన్ను మినహాయింపును రూ.10 కోట్లకే పరిమితం చేయడంతో అధిక ధర కలిగిన లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్షకాలిక మూల ధన లాభాలపై పన్ను మినహాయింపు కోసం చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇలాంటి భారీ డీల్స్ చేస్తుంటారు. తాజాగా దీనికి కూడా పరిమితి విధించడంతో భారీ లావాదేవీలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.