-
ప్రజల్ని ముంచాలి.. మనం బాగుపడాలి!
-
ఇదే జయ గ్రూప్ స్కెచ్?
-
జయ గ్రూప్ ఎండీ అరెస్టు సరే..
బాధితుల్ని ఆదుకునేదెవరు?
-
సంస్థ డైరెక్టర్లను అరెస్టు చేయాలి
-
విచారించి.. నిజాల్ని నిగ్గు తేల్చాలి
-
బాధితులను ఆదుకునేందుకు
ఒక కమిటీని నియమించాలి
-
సంస్థ ఆస్తులపై ఆరా తీయాలి
-
అసంపూర్తి నిర్మాణాల్ని ఇతర బిల్డర్లకు అప్పగించాలి
-
వాటిని పూర్తి చేసి బయ్యర్లకు అప్పగించాలి
- జయ గ్రూప్ స్కామ్‌లో మోసపోయిన
200కు పైగా బాధితులు - కాళ్లు అరిగేలా తిరుగుతున్న జనం
- ఎవరిని అడగాలి? ఏం చేయాలి?
- అయోమయ పరిస్థితిలో బాధితులు
- మొహం చాటేసిన జయ గ్రూప్ డైరెక్టర్లు
- కొత్త దుకాణం మొదలు పెట్టిన మరో డైరెక్టర్
- కాకర్ల బ్యాచ్ కొత్త వెంచర్లతో మళ్లీ నయా మోసాలు
- మార్కెటింగ్ మేనేజర్‌కు విల్లాలు, కార్లు..
- జనం సొమ్ముతో జల్సాలు చేసిన కాకర్ల బ్యాచ్
- 300 కోట్లను కాకర్ల ఏం చేసినట్లు?
- కాకర్లను కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తులెవరు?
- బాధితులకు మంత్రి కేటీఆర్ న్యాయం చేయాలి
ఓ దంపతులు కూతురి పెళ్లి నిమిత్తం కొన్నేళ్ల నుంచి దాచుకున్న రూ. 50 లక్షలను.. ఒక డైరెక్టర్ చెప్పిన మాయమాటల్ని నమ్మేసి.. జయ గ్రూపులో పెట్టుబడి పెట్టారు. డబ్బులన్నీ వారి చేతిలో పోసిన కొన్నాళ్లకే అర్థమైంది. కాకపోతే, అప్పటికే సొమ్ము కట్టేయడంతో చేసేదీ ఏమీ లేక.. దేవుడి మీద భారం వేశారు. అయితే, వాళ్ల అనుమానం నిజమేనని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా.. కూతురి పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును ఇప్పించమంటూ.. పోలీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
పదవీవిరమణ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ తీసుకెళ్లి కాకర్ల శ్రీనివాస్ కంపెనీలో పెట్టాడు.. ఈ సంస్థ చేసే హంగూ ఆర్భాటం నిజమేనని భావించాడు. ఇంకేముంది, తక్కువ రేటుకే ఫ్లాట్ చేతికొస్తుందని కలలు కన్నాడు. అంతే, అవి కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కాక.. కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియక.. తెగ ఆందోళన చెందుతున్నాడు. పోలీసుల చుట్టూ తిరిగినా.. జయ కంపెనీకి రోజూ వెళ్లినా ఏం లాభం? ఇలాంటి ప్రీలాంచ్ కంపెనీలు రాకుండా ప్రభుత్వం కట్టడి చేసి ఉంటే.. మోసపోయే వారమే కాదని కన్నీరుమున్నీరు అవుతున్నారు.
రేటు తక్కువ.. నెలనెలా వడ్డీ వస్తుంది.. ఈ రెండే రెండు అంశాల్ని చూసి.. గచ్చిబౌలిలో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగి.. బంధుమిత్రుల వద్ద అప్పు తెచ్చి మరీ కోటీన్నర రూపాయలను జయ గ్రూపులో పెట్టుబడి పెట్టారు. ఇంకేముంది.. వడ్డీ రావడమే ఆలస్యమని భావిస్తున్న తరుణంలో.. సంస్థ ఎండీని పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఇతని కాళ్ల కింద భూమి కంపించినంత పనయ్యింది.
ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు రెండు వందలకు పైగా సామాన్య, మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు.. కాకర్ల బ్యాచ్ మాయమాటలు నమ్మేసి.. సొమ్ము చెల్లించారు. ఇవన్ని ఎలా రాబట్టుకోవాలో తెలియక, రాత్రిళ్లు నిద్ర పట్టక కుమిలి పోతున్నారు. వీరందరికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిపై ఉన్నది అన్నది ఇప్పుడు బాధితులకు ప్రశ్నార్థకమైపోయింది. ఇప్పుడీ సంస్థ దాదాపు 300 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది. మరి ఇప్పుడు ఆ 300 కోట్ల రూపాయలను బాధితులకు ఇచ్చేది ఎవరు? ఇప్పించాల్సిన బాధ్యత ఎవరిపై ఉన్నది..? బాధితులకు ఆఫీసు అడ్రస్ తప్ప మిగతా విషయాలు ఏమి తెలియకపోవడం గమనార్హం.
కాకర్ల శ్రీనివాస్.. కహానీ ఇంతేనా?
జయ గ్రూప్ అలియాస్ జయంత్రి ఇన్ ఫ్రా. ఈ గ్రూప్ మొదలుకు ఆజ్యం పోసిన కంపెనీ కేఎస్ ప్రాపర్టీస్. ఈ సంస్థ ఎండీ కూడా కాకర్ల శ్రీనివాసే. కేఎస్ ప్రాపర్టీస్‌కు ముందు భీమడోలు గ్రామం ద్వారకా తిరుమల మండలం పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మోసాలు చేసినట్లు విచారణలో కాకర్ల శ్రీనివాస్ ఒప్పుకున్నట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. భీమడోలులో మొదలైన మోసాలు చివరకు హైదరాబాద్ వరకు విస్తరించాయి. అందరికి ఒకే తరహా హామీ ఇచ్చాడు. అనుకున్నట్లుగా కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. డబ్బును అంతా సర్ధేశాక చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు చిన్నగా కాకర్ల కాకమ్మ ముచ్చట్లు డైరెక్టర్లతో చెప్పిస్తున్నారు. డబ్బులను కోట్లకు కోట్లు దోచుకొని దాచుకున్న వాళ్లు పరారైయ్యారు. చిన్న చితక వాళ్లు డైరెక్టర్లను ముందు పెట్టి మాట్లాడిస్తున్నట్లుగా బాధితులు వాపోతున్నారు.
కాకర్ల బ్యాచ్ మోసాల వెనక ఎవరు?
కాకర్ల శ్రీనివాస్ ఒక్కడే ఇంత పెద్ద మోసం చేయలేదన్నది వాస్తవం. ఇతని ఒక్కడితో ఇంత పెద్ద మొత్తంలో స్కాం జరగలేదన్నది జగమెరిగిన సత్యం. మరి కాకర్ల శ్రీనివాస్‌ను తెర వెనుక నుంచి నడిపించిన ఆ వ్యక్తులు ఎవరు? కాకర్ల శ్రీనివాస్ ముందు ఉండి సంపాందించిన డబ్బు ఎవరి చేతిలో పెట్టాడు? కాకర్ల శ్రీనివాస్ జనం సొమ్ముతో ఎవరు ఎవరికి ఎంత ఎంత డబ్బు ఇచ్చాడు? ఇలా వంద రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డబ్బులు కట్టించుకునేటప్పుడు ముందున్న డైరెక్టర్లు ఇప్పుడు ఎక్కడికి పారిపోయారు? ‘‘డబ్బు కట్టండి మేమున్నాం. మీ డబ్బుకు మాది గ్యారంటీ. కావాలంటే ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకుందాం. మొత్తం డబ్బులు కట్టండి.. ’’ ఇలాంటి కబుర్లు చెప్పి డబ్బులు కట్టించుకున్న డైరెక్టర్లు ఇప్పుడు బాధితుల తరపున ఎందుకు మాట్లాడట్లేదు? అంటే.. ఇక్కడ కాకర్ల శ్రీనివాస్‌తో కలిసి కంపెనీలో ఉన్న ఓ డజను మంది డైరెక్టర్లు మోసాలకు పాల్పడ్డారన్నది వాస్తవం. మొత్తం డైరెక్టర్లలో సగం మంది కాకర్ల శ్రీనివాస్ బంధువులే కావడం గమనార్హం.
రాజేష్‌కు కోటిన్నర ఇళ్లు.. దొరబాబుకు కార్లు, బంగారం
చేసేది మార్కెటింగ్ ఉద్యోగం. జీతం మహా అంటే ఓ నెలకు ఓ 50,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. అది పెద్ద పొజిషన్లో ఉంటే. కానీ. ఇక్కడ రాజేష్ నక్క తోక కాదు కాకర్ల తోక తొక్కడు. ఎగబడి జనంతో డబ్బులు కట్టించాడు. కాకర్లకు దోచిపెట్టాడు. ఫలితంగా కోటిన్నర నుంచి రెండు కోట్ల విలువ చేసే ఇల్లు సంపాదించాడు. కార్లు, బంగారం వచ్చాయి. ఇంకేముంది జనాన్ని ముంచుదాం. మనం బాగుపడదాం అనుకున్నారు. ఏదైనా బాస్ కాకర్ల చూసుకుంటాడు అనుకున్నాడు. కాకర్లకు చేదోడు వాదోడుగా ఉండి.. స్కాంలో ఇతను భాగమయ్యాడు. ఎండీ అరెస్ట్ అవ్వక ముందు అందరికీ మోసపూరిత మాటలు చెప్పాడు. ఇప్పుడు బాధితులకు అవే మాటలు చెబుతున్నాడు. కాదు కాదు.. బాస్ కాకర్ల ఇతనితో చెప్పిస్తున్నాడు. ఇక్కడ బాధితులతో మాట్లాడటం.. ఆ విషయాలు బాస్ కాకర్లకు చేరవేయడం.. ఇతని పని. ఇతనే కాకుండా ఇతనితో పాటు దొరబాబు తోడయ్యాడు. వీళ్లు ఇద్దరు మిగతా డైరెక్టర్లకు ఎప్పటికప్పుడు బాధితుల మాటలు, ఆలోచనలు, ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? ఇలా అన్ని విషయాలు అందజేస్తున్నాడు. బాస్ అక్కడి నుంచి స్కెచ్ వేయడం.. దాన్ని ఇక్కడ బాధితులతో ఒకరు ఇద్దరు చేర వేయడం చేస్తున్నారు. ఇలా ఇప్పటికి బాధితులను కలిసికట్టుగా మోసం చేస్తూనే ఉన్నారు.
డైరెక్టర్లను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
జయ గ్రూప్‌లో మొత్తం ఓ డజను మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరంతా బాధితులతో డబ్బులు కట్టించారు. కంపెనీ మూత పడే అవకాశం ఉందనగా.. ఒకరిద్దరు జయ గ్రూప్ నుంచి వెళ్లిపోయి సొంతంగా వెంచర్లు మొదలెట్టారు. అక్కడ ఏ ఒక్క వెంచర్‌కు ఎలాంటి అనుమతుల్లేవు. వాళ్లు అక్కడ ఇదే తరహా మోసాలను ఆరంభించారు. ఇక ఇప్పుడున్న డైరెక్టర్లు బాధితులకు నమ్మకమైన మాటలు చెప్పడంతో డబ్బులు కట్టారు. కాకర్ల శ్రీనివాస్‌కి కానీ, కాకర్ల శ్రీనివాస్‌ను నమ్మి కానీ బాధితులు ఎవరు డబ్బులు కట్టలేదు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ప్లాట్, విల్లా, మెట్రో స్టాల్స్ కోసం డబ్బులు కట్టిన వాళ్లు అంతా మొదట డైరెక్టర్ల అబద్ధపు మాటల్ని నమ్మే కట్టారు. మరి డబ్బులకు మేము గ్యారంటీ అన్న వాళ్లంతా ఇప్పుడు ఎందుకు డబ్బులు తిరిగి ఇప్పించట్లేదు? ఎండీని అరెస్ట్ చేస్తే న్యాయం జరుగుతుందా..? డైరెక్టర్లను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.