సీసీఎస్లో ఫిర్యాదు చేసిన పారిజాత డెవలపర్స్ ఛైర్మన్
కొంతమంది అక్రమార్కులు కలిసి తనను రూ.82 కోట్ల మేరకు మోసగించారని.. నగరానికి చెందిన పారిజాత డెవలపర్స్ ఛైర్మన్ టి. అంజయ్య సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో తాజాగా ఫిర్యాదు చేశారు. చక్కా వెంకట సుబ్రమణ్యం అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం తనను కలిసి.. తెలంగాణలో తాము అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలో మార్కెటింగ్ చేసి ప్లాట్లను అమ్మిపెడతానని ప్రతిపాదన తెచ్చాడని తెలిపారు. ఈ క్రమంలో చక్కా వెంకట సుబ్రమణ్యం అతని సిబ్బంది కలిసి తమ ప్లాట్లను విక్రయించి కంపెనీ ఖాతాలో సొమ్ము జమ చేసేవారని.. ఆ తర్వాత సదరు వ్యక్తితో పాటు అతని మార్కెటింగ్ సిబ్బంది ప్రజల నుంచి భారీ స్థాయిలో సొమ్మును వసూలు చేసి.. తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్నారని ఫిర్యాదులో టి. అంజయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం పేరు మీద శామీర్‌పేట్ పోలీసు స్టేషన్‌లో 2020లో కేసు నమోదు అయ్యిందని ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత రూ.38.25 కోట్లు చెల్లిస్తానని చక్కా వెంకట సుబ్రమణ్యం ఎంవోయూ రాసిచ్చాడని, కానీ ఇంతవరకూ సొమ్ము చెల్లించలేదని సీసీఎస్ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సెక్షన్ 406, 402 మీద సుబ్రమణ్యం మీద కేసు నమోదు చేశారు.
ఎవరీ సుబ్రమణ్యం?
రాజమండ్రికి చెందిన చక్కా వెంకట సుబ్రమణ్యం చాలామందికి సొమ్ము ఎగ్గొట్టి.. అక్కడ ఐపీ కూడా పెట్టాడని సమాచారం. ఆతర్వాత నగరానికి విచ్చేసి పారిజాత డెవలపర్స్‌లో ప్లాట్లను విక్రయించేవాడు. ఇదే క్రమంలో బయ్యర్లతో పరిచయం పెంచుకుని.. తాను కూడా పారిజాత డెవలపర్స్ మాదిరిగా రెరా అనుమతి తీసుకుని ఫ్లాట్లను శామీర్ పేట్‌లో కడుతున్నానని.. అందులో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ధర రూ. 12 లక్షలేనని తొలుత కొందరికి అమ్మాడు. తర్వాత రేటును పదహారు లక్షలకు పెంచేశాడు. అప్పట్లో కరోనా సమయం కావడం.. అప్పటికే పరిచయం ఉండటంతో.. కొందరు సైటు చూడకుండానే ఫ్లాట్లకు సొమ్ము కట్టారు. భువనతేజ ఇన్‌ఫ్రా అనే సంస్థను తన భార్య పేరిట ఆరంభించి.. ప్రీలాంచ్ దందాను కొంతకాలం పాటు నాలుగు పూవులు ఎనిమిది కాయలుగా నిర్వహించాడు. ఇలా, అమాయక బయ్యర్లకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయల్ని దండుకున్నాడు. అయితే, అపార్టుమెంట్లు కట్టడమంటే ప్లాట్లు అమ్మినంత సులువు కాదనే విషయం కొందరు తెలివైన కొనుగోలుదారులకు అర్థమై సొమ్ము వెనక్కి ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. ఇలా అనేక మంది నేటికీ భువనతేజ కార్యాలయం చుట్టూ సొమ్ము కోసం తిరుగుతూనే ఉన్నారు. మాటకారి అయిన సుబ్రమణ్యం ఏదోరకంగా మాయమాటలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కొందరు వాపోతున్నారు. ఈ క్రమంలో అతనిపై సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడం ఎటు దారి తీస్తుందో? కొనుగోలుదారులకు సకాలంలో సొమ్ము అందిస్తాడో లేదో?