తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కొత్త సంస్థల ప్రకటనల వల్ల ప్రజలకెంత ఉపయోగముందో.. ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయో తెలియదు కానీ.. రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రం భలే ఉపయోగపడుతుంది. ఏజెంట్లు ప్లాట్ల రేట్లను పెంచుతున్నారు. భూయజమానులు భూముల ధరలను పెంచి చెబుతున్నారు. వచ్చే ఐదు నుంచి పదేళ్లలో పెరగాల్సిన రేట్లను ఇప్పుడే పెంచేస్తున్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రాత్రికి రాత్రే అద్భుతం జరిగే ప్రసక్తే లేదు..
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఎన్కతలలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్ గురించి ప్రకటన విడుదల చేశారో లేదో.. శంకర్‌పల్లి, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, వికారాబాద్ వరకూ.. కొంతమంది ఏజెంట్లు ఒక్కసారిగా ప్లాట్ల ధరలను పెంచేశారు. స్థల యజమానులు భూముల ధరలను రెట్టింపు చేసే పనిలో పడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మంత్రి కేటీఆర్ కేవలం ప్రకటన మాత్రమే చేశారు. ఎన్కతలలో ఈ క్లస్టర్ ఏర్పడేందుకు ఎంత సమయం పడుతుందో ఇంకా తెలియదు. అక్కడ ఎన్ని సంస్థలు వస్తాయో తెలియదు. ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పక్కాగా లభిస్తాయో తెలియదు. ఇవన్నీ వాస్తవరూపం దాల్చడానికి ఎంతలేదన్నా నాలుగైదేళ్లు పట్టే అవకాశముంది. అక్కడ సంస్థలొచ్చి కార్యకలాపాలు ఆరంభించి.. ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఇంకెంత సమయం పడుతుందో తెలియదు. కాబట్టి, ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. నాలుగైదేళ్ల తర్వాత పెరిగే ధరలను ఇప్పుడే కొందరు ఏజెంట్లు పెంచేస్తున్నారు. అక్కడేదో అద్భుతం జరుగుతుందనే ప్రచారాన్ని నిర్వహిస్తూ.. ప్లాట్ల రేట్లను రెట్టింపు చేసే పనిలో పడ్డారు. సందిట్లో సడేమియాలా ఈ ప్రాంతాల్లోని స్థలయజమానులూ రేట్లను పెంచుతున్నారు. కాబట్టి, మీరు ఈ మాయలో పడి.. పెరిగిన రేట్లను పెట్టి ఎట్టి పరిస్థితిలో ప్లాట్లు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేయకండి. ప్రకటన రాక ముందు ఉన్న రేటుకే కొనుగోలు చేయండి. ప్రతి అంశాన్ని వాస్తవికంగా ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకోండి.