-
టీఎస్ రెరా ఛైర్మన్గా శాంతికుమారి నియామకం
-
ప్రీలాంచులు తగ్గుతాయని అంటున్న నిర్మాణ రంగం
-
జీవో విడుదల చేసిన స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్
-
భువనతేజ, ఆర్జే గ్రూప్, ఏవీ ఇన్ఫ్రాకాన్,
యోషితా ఇన్ఫ్రా వంటివి ప్రీలాంచ్ సంస్థలే!
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా ఛైర్మన్గా సీఎస్ శాంతికుమారిని నియమించింది. గత సీఎస్ సోమేష్కుమార్ని ఏపీకి బదిలీ మీద వెళ్లడంతో.. రెరాకు కొత్త ఛైర్మన్ ని నియమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ శుక్రవారం జీవోను విడుదల చేశారు.
మాజీ సీఎస్ మంచి నిర్ణయం
మాజీ సీఎస్ సొమేష్ కుమార్ ఏపీకి వెళ్లిపోయే ముందు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రీలాంచులను చేపడుతున్న సంస్థల పేర్లను పత్రికాముఖంగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ప్రజలు మోసపూరిత సంస్థల్లో పెట్టుబడుల్ని పెట్టకుండా నిలిపివేయవచ్చు. ఇంత మంచి నిర్ణయాన్ని కొత్త సీఎస్ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం రెరా విభాగంతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ విభాగాన్ని సరికొత్త దిశలో ముందుకు తీసుకెళ్లాలని పలువురు డెవలపర్లు కోరుతున్నారు.
* * భువనతేజ, ఆర్జే గ్రూప్, ఏవీ ఇన్ఫ్రాకాన్, యోషితా ఇన్ఫ్రా, ఫార్చ్యూన్ 99 హోమ్స్ వంటి అనేక సంస్థలు ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. ఈ సంస్థలకు రియల్ రంగంలో పెద్దగా అనుభవం లేకున్నా.. ప్రజల్నుంచి సొమ్ము తీసుకుని.. భూముల్ని కొనుగోలు చేసి.. వారికే పంగనామాలు పెడుతున్నాయి. ఇప్పటికే సాహితీ, జయ గ్రూప్ వంటివి బిచాణా ఎత్తేశాయి. వందలాది మందిని దారుణంగా మోసం చేశాయి. ఈ జాబితాలో మరిన్ని సంస్థలు చేరకూడదంటే.. రెరా అథారిటీ తక్షణమే ప్రీలాంచులపై కఠిన చర్యల్ని తీసుకోవాలి. ప్రీలాంచు సంస్థలు బోర్డు తిప్పకముందే ఆయా కంపెనీల నుంచి పూర్తి వివరాలు సేకరించాలి. ఇప్పటిదాకా ఎంతమందికి ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ విక్రయించారు? ఎంతమంది నుంచి ఎన్ని కోట్లు వసూలు చేశారు? మరి, ఆయా సొమ్ముకు తగ్గట్టుగా ప్లాట్లు, ఫ్లాట్లను అందజేస్తారా? తదతర విషయాలన్నీ బేరీజు వేయాలి. దాని ప్రకారమే ఆయా కంపెనీలపై తగు చర్యలకు ఉపక్రమించాలి. అందులో కొన్నవారికి న్యాయం చేయాలి.