ప్రీలాంచ్.. ఈ పదం రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి చాలా సుపరిచితం. నిజానికి ప్రీలాంచ్ ఆఫర్లు అనేవి అటు డెవలపర్లకు, ఇటు కొనుగోలుదారులకు లాభం చేకూర్చేవే. ఇదంతా ఆ ప్రాజెక్టు సక్రమంగా పూర్తి చేసినప్పుడు మాత్రమే. కానీ ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో దగా చేసిన సంస్థలే ఎక్కువగా ఉండటంతో ప్రీలాంచ్ పై చాలామందికి అనుమానాలు సహజం. అలాగే ప్రీ లాంచ్ తరహాలో సాఫ్ట్ లాంచ్ అనే పదం కూడా ప్రాచుర్యంలో ఉంది.
ప్రీలాంచ్ కంటే సాఫ్ట్ లాంచ్ చాలా సురక్షితమైనది. ప్రీలాంచ్ లో చట్టపరమైన, పరిపాలనాపరమైన అనుమతులు ఉండవు. కానీ సాఫ్ట్ లాంచ్ లో ఆ అనుమతులు పూర్తి కానప్పటికీ, ఆ ప్రక్రియ ప్రారంభమై ఆమోదం పొందడానికి రెడీగా ఉంటాయి. రెసిడెన్షియల్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే సొమ్ముకు ఇది భరోసా కల్పిస్తుంది. అనుమతుల ప్రక్రియ పురోగతిలో ఉండటమే కాకుండా ప్రాజెక్టు అమ్మకానికి గడువు ఉంటుంది.
అలాగే డాక్యుమెంటేషన్ ప్రక్రియలు సాఫ్ట్ లాంచ్ లో దాదాపు సగం వరకు పూర్తవుతాయి. విక్రయించే దశలో ఈ ప్రాజెక్టుకు చట్టబద్ధమైన ఆమోదం లభిస్తుంది. అందువల్ల చట్టం నుంచి పూర్తి రక్షణ కలుగుతుంది. రెరా నెంబర్ పొందిన ప్రాజెక్టులు నిస్సందేహంగా రిస్కు లేనివని గుర్తుంచుకోండి. నగరంలో అనేకమంది బిల్డర్లు రెరా అనుమతి లభించాక కొన్ని రోజుల పాటు సాఫ్ట్‌లాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తుండటం విశేషం.