poulomi avante poulomi avante

రిజిస్ట్రేష‌న్లు ఎప్పుడు చేస్తావు భువ‌న‌తేజ‌?

BhuvanaTeja Infra New Fraud with Home Buyers in Tulasi BhagyaNagar Project @ Dundigal.

    • ప్రాజెక్టు ఒక‌రిది.. త‌న‌దేనంటూ బిల్ట‌ప్‌ ఇచ్చిన ”చ‌క్క‌
    • 200 మంది నుంచి రూ.52 కోట్లు వ‌సూలు
    • అందులో స‌గం సొమ్ము బిల్డ‌ర్‌కు క‌ట్ట‌ని ”చ‌క్క”
    • 2020 నుంచి నేటివ‌ర‌కూ రిజిస్ట్రేష‌న్లు కాలేదు
    • గ‌గ్గోలు పెడుతున్న కొనుగోలుదారులు
    • సొమ్ము క‌డితేనే రిజిస్ట్రేష‌న్ అంటున్న బిల్డ‌ర్‌
    • జీఎస్టీని ఎగ‌వేసిన చ‌క్క వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యం
    • జీఎస్టీ అధికారులు భువ‌న‌తేజ‌పై దృష్టి పెట్టాలి

( రెజ్ న్యూస్ టాస్క్‌ఫోర్స్‌ )

క‌రోనాలో పుట్టుకొచ్చిన రియ‌ల్ సంస్థ‌ల్లో ఒక‌టైన భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా.. కొనుగోలుదారులతో ఒక ఆటాడుకుంటోంది. క‌రోనాను స‌మ‌ర్థంగా అధిగ‌మించినా.. రియాల్టీలో భువ‌న‌తేజ వంటి వైర‌స్‌తో బ‌య్య‌ర్లు నేటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి.. పైసాపైసా కూడ‌బెట్టి సంపాదించిన సొమ్ముతో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని భావించిన వారు.. దుండిగ‌ల్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసి న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. 2020లో సొమ్ము క‌ట్టినా.. నేటికీ రిజిస్ట్రేష‌న్లు కాక‌పోవ‌డంతో.. ఏం చేయాలో తెలియ‌క‌.. ఎవ‌రికి త‌మ మొర చెప్పుకోవాలో అర్థం కాక‌.. ఆవేద‌న చెందుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

అది 2020వ సంవ‌త్స‌రం..
దుండిగ‌ల్‌లో రూ.26 ల‌క్ష‌ల‌కే ఫ్లాట్‌..
ఈ ప్ర‌క‌ట‌న నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొట్టింది..
కొనుగోలుదారుల్ని అమితంగా ఆక‌ర్షించింది..

ప్రాజెక్టులోకి వెళ్లి చూస్తే మంచి లొకేష‌నే.. 6.3 ఎక‌రాల స్థ‌లం.. 9 ట‌వ‌ర్లు.. 700 ఫ్లాట్లు.. ప్లాను ఫ‌ర్వాలేదు.. పైగా ఐదు అంత‌స్తులే.. అనేక మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు. నిర్మాణ ప‌నులూ జోరుగా జ‌రుగుతున్నాయి. బిల్డ‌ర్ శ్ర‌ద్ధ‌తో ప‌నుల్ని జ‌రిపిస్తున్నారు. అంతా బాగానే ఉన్న‌ప్పుడు స‌మ‌స్య ఎక్క‌డొచ్చింద‌న్న‌ది మీ సందేహ‌మా? అప‌లు విష‌యం తెలిస్తే మీరు విస్తుపోతారు.

ఇక్క‌డ ప్రాజెక్టు ఒక‌రిది.. అంటే తుల‌సీ భాగ్య‌న‌గ‌ర్ ప్రాజెక్టును బొడ్డు అశోక్ అనే బిల్డ‌ర్ నిర్మిస్తున్నారు. కానీ, అందులో ఫ్లాట్ల‌ను విక్ర‌యించిందేమో భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా సంస్థ‌కు చెందిన చ‌క్కా వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం మ‌రియు అత‌ని గ్యాంగ్‌. ఇక్క‌డ బిల్డ‌ర్ ఏం చేశాడంటే.. కొంత‌మంది ఛానెల్ పార్ట్‌న‌ర్ల‌ను ఏర్పాటు చేసుకుని ఫ్లాట్ల‌ను విక్ర‌యించాడు. అందులో ఒక ఛానెల్ పార్ట‌న‌రే ఈ భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా అండ్ గ్యాంగ్‌. పైగా, వీరంతా విక్ర‌యించింది ప్రీలాంచులోనే కావ‌డం గ‌మ‌నార్హం.

చ‌క్క సుబ్ర‌మ‌ణ్యం ఏం చేశాడంటే..

పేరుకే ఇత‌ను ఛాన‌ల్ పార్ట్‌న‌ర్ అయిన‌ప్ప‌టికీ.. ఈ ప్రాజెక్టు త‌న‌దే అన్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చాడు. ఏ ప్రాజెక్టు బై భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా అంటూ ఏకంగా బ్రోచ‌ర్ల‌ను ముద్రించాడు. ఈ ప్రాజెక్టు సైటు ఆఫీసులోనే కుర్చీలు వేసుకుని.. 2020 నుంచి 2021 వ‌ర‌కూ దాదాపు 200 వందల ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. రూ. 26 ల‌క్ష‌ల చొప్పున సుమారు 200 మంది నుంచి దాదాపు రూ.52 కోట్ల‌ను వ‌సూలు చేశాడు. వీరికి ఈ సారువారే మూడు పేజీల అగ్రిమెంట్ రాసిచ్చాడు. కాక‌పోతే, అది నాలుక‌కు గీసుకోవ‌డానికీ ప‌నికి రాద‌ని.. దాన్ని చూస్తే ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అందులో కొన్న‌వారిలో కొంద‌రు ఆ త‌ర్వాత ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. మ‌రికొంద‌రేమో అలాగే కొన‌సాగుతున్నారు. మ‌రి, స‌మ‌స్య ఎక్క‌డొచ్చింది?

అస‌లు క‌థ ఇదే!

2020 నుంచి ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న‌వారి నుంచి చ‌క్క వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం సుమారు రూ. 52 కోట్లు వ‌సూలు చేశాడు. కాక‌పోతే, అందులో స‌గం సొమ్మును నేటికీ బిల్డ‌ర్ అయిన బొడ్డు అశోక్‌కు చెల్లించ‌లేదు. సొమ్ము రాక‌పోతే బిల్డ‌ర్ ఫ్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేయ‌డు క‌దా! దీంతో, మ‌ధ్య‌లో కొనుగోలుదారులు న‌లిగిపోతున్నారు. తుల‌సీ భాగ్య‌న‌గ‌ర్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న‌వారు నేటికీ పంజాగుట్ట‌లోని భువ‌న‌తేజ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. అడిగిన ప్ర‌తిసారి రేపు.. మాపు.. అంటూ 2020 నుంచి చ‌క్క వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యం కాల‌యాప‌న చేస్తున్నాడ‌ని కొనుగోలుదారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌లాంటి అనేక మంది కొనుగోలుదారులు చ‌క్క వెంక‌ట సుబ్ర‌మ‌ణ్యం వంటివారు తెలంగాణ రాష్ట్రంలో ప్రీలాంచుల పేరిట మోసం చేస్తున్నారని.. ఇలాంటి మోస‌పూరిత రియ‌ల్ట‌ర్ల ప‌ట్ల కొనుగోలుదారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

బిల్డ‌ర్ ఏమంటున్నాడంటే..

ఈ మొత్తం వ్య‌వ‌హారం గురించి తెలుసుకోవ‌డానికి భువన‌తేజ సంస్థ‌తో మాట్లాడ‌టానికి రెజ్ న్యూస్ ప్ర‌య‌త్నించ‌గా స‌మాధానం రాలేదు. ఈ అంశంపై బిల్డ‌ర్ బొడ్డు అశోక్ తో మాట్లాడింది. భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా సంస్థ సుమారు 120 మందికి ఫ్లాట్ల‌ను విక్ర‌యించిన‌ట్లు త‌మ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని.. అందులో కేవ‌లం స‌గం మంది సొమ్ము మాత్ర‌మే త‌మ‌కు చెల్లించాడ‌ని.. మిగ‌తా సొమ్ము క‌ట్ట‌గానే తాము రిజిస్ట్రేష‌న్ చేస్తామ‌ని అన్నారు. ఈ అంశంపై భువ‌న‌తేజ సంస్థ‌తోనే మాట్లాడాల‌ని సూచించారు.

మ‌రి, భువ‌న‌తేజ‌ను ఎందుకు సైట్ ఆఫీసులో కూర్చోబెట్టి ఫ్లాట్ల‌ను విక్ర‌యించేందుకు అనుమ‌తించార‌నే ప్ర‌శ్న‌కు.. త‌మ‌తో అనేక మంది ఛానెల్ పార్ట్‌న‌ర్లు ప‌ని చేస్తార‌ని.. అందులో భువ‌న‌తేజ సంస్థ ఒక‌ట‌ని చెప్పుకొచ్చారు. మొత్తానికి, సుమారు అర‌వై మంది సొంతింటి క‌ల సాకారం కావాలంటే.. భువ‌న‌తేజ సంస్థ చ‌క్క వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యం దాదాపు రూ.15.60 కోట్ల‌ను బిల్డ‌ర్ కు చెల్లించాల్సి ఉంటుంది. మ‌రి, ఆయ‌న కొనుగోలుదారుల నుంచి వ‌సూలు చేస‌న సొమ్మును ఏం చేశాడు? ఎక్క‌డికి బ‌దిలీ చేశాడు? 2020 నుంచి న‌గ‌రంలో పెరిగిన ఇలాంటి ప్రీలాంచ్ మోస‌గాళ్ల ప‌ట్ల ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం కొర‌డా ఝ‌ళిపించ‌క‌పోతే అనేక‌మంది ప్ర‌జ‌లు మోస‌పోయే ప్ర‌మాద‌ముంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles