భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ విచ్చేసినప్పుడు.. హైదరాబాద్ నుంచి నంద్యాల దాకా ఫోర్ లేన్ రహదారిని అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో.. శ్రీశైలం హైవే
ప్రతిఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈ రహదారి ఏర్పాటు వల్ల ప్రప్రథమంగా ప్రయోజనం పొందే ప్రాంతం.. ఆమన్‌గల్. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి చెందినట్లే.. భవిష్యత్తులోనూ రీజినల్ రింగ్ రోడ్డు వల్ల ఆమన్‌గల్ అదే విధంగా అభివృద్ధి చెందే ఆస్కారముంది. మూడు, నాలుగేళ్లలో అప్రిసీయేషన్ కావాలనే వారికి.. పదవీవిరమణ తర్వాత ఇల్లు కట్టుకోవాలని భావించేవారికి.. ఆమన్‌గల్ ఒక చక్కటి ఆప్షన్‌గా కనిపిస్తోంది.
ప్లాటు రేటు తక్కువుండాలి.. అప్రిసీయేషన్ ఎక్కువుండాలి..
అవసరమైతే అమ్ముకుంటాం.. లేకపోతే ఇల్లు కట్టుకుంటాం..
హైదరాబాద్‌లో ప్లాట్లు కొనాలి భావించేవారు.. ఇంచుమించు ఇలాగే ఆలోచిస్తుంటారు. ప్లాటు కొనేటప్పుడు రేటు తక్కువుండాలని ఆశిస్తారు. పిల్లల చదువులకో, పెళ్లిళ్లకో అవసరమైతే అమ్ముకునేలా ఉండాలని భావిస్తారు. లేదా తాము పదవి విరమణ తర్వాత అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడాలని ఆరాటపడతారు. మరికొందరేమో ప్లాటు కొన్న మూడు లేదా నాలుగేళ్లకు కాస్త అధిక రేటుకు అమ్ముకోవాలని ఆలోచిస్తారు. ఇలాంటి వారందరికీ.. ఆమనగల్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు.
అసలు ఆమన్ గల అంటే ఎక్కడ? హైదరాబాద్‌కు ఎంత దూరంలో ఉంటుందనేది మీ సందేహమా? ఆగండాగండీ.. అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం ఓఆర్ఆర్ వద్ద రింగ్ రోడ్డు దిగగానే తుక్కుగూడ నుంచి నలభై నిమిషాల్లో ఆమన్‌గల్‌కు చేరుకోవచ్చు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉంటుందీ ప్రాంతం. ప్రస్తుతం ఓఆర్ఆర్ వద్ద తుక్కుగూడ ఎలాగైతే అభివృద్ధి చెందిందో.. దాదాపు అదేవిధంగా రీజినల్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలోనే ఆమన్‌గల్ ఉంటుంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే ప్రస్తుతం ఇక్కడ ప్లాట్ల రేట్లు తక్కువున్నాయి కాబట్టి.. ఇక్కడ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ అందుకునే వీలుంటుంది. మరి, ఎందుకు ఆమన్ గల్ ఇటీవల కాలంలో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది.
అభివృద్ధి దిశగా ఆమన్‌గల్
రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఆనుకుని ఉన్న ప్రాంతమే.. ఆమన్ గల్ మున్సిపాలిటీ. మహేశ్వరం, తుక్కుగూడ, మంఖాల్, తుమ్మలూరు, కందుకూరు, నేద్‌నూర్, కడ్తాల్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లు కొనలేనివారంతా ప్రస్తుతం ఆమన్ గల్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే, ఈ మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే ఆవాసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. పైగా, మున్సిపల్ ప్రాంతంలో నచ్చినట్లుగా.. ఎవరికి వారే వ్యక్తిగత ఇళ్లను కట్టుకోవచ్చు. లేదా భవిష్యత్తులో పెట్టుబడి కోసమైనా ఇందులో కొనుగోలు చేయవచ్చు. ఈ అంశాన్ని గ్రహించిన అధిక శాతం మంది ఇందులో ప్లాట్లను కొనడానికి ముందుకొస్తున్నారు.
ఫార్మా సిటీ పక్కనే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. సుమారు 19000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ముచ్చర్ల ఫార్మా సిటీలోని 13,500 ఎకరాలు కడ్తాల్ పరిధిలో ఉన్నాయి. అంటే, ఆమనగల్ కు సుమారు 4-5 కిలోమీటర్లలోనే ఫార్మా సిటీ అభివృద్ధి చెందుతోందన్నమాట. కాబట్టి, ఫార్మా సిటీలో పని చేసేవారెవ్వరైనా… కాస్త తక్కువ రేటులో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే.. ఆమన్‌గల్ లోనే ప్లాటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అనేమంది తెలివైన పెట్టుబడిదారులు.. ఆమన్‌గల్ వైపు ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు.
మినీ ట్యాంక్ బండ్..
మంత్రి హరీష్ రావు ఆమన్‌గల్‌లోని సురసముద్రం అనే చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సుమారు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాంతం చుట్టుపక్కల గల ఐదు మండలాలకు నడిమధ్యలో ఉంటుంది. ఇది పూర్తయితే ఆమన్‌గల్‌కు చుట్టుపక్కల మండలాల్నుంచి రాకపోకలు మరింగ పెరుగుతాయి. ఈ మండలాలకు చెందిన ప్రజలు షాపింగ్ చేయాలన్నా.. సినిమా చూడాలన్నా.. ఇతర ప్రాంతాలకు రాకపోకలను సాగించాలన్నా తప్పనిసరిగా ఆమన్‌గల్‌కు విచ్చేస్తుంటారు.
మెడికల్ కళాశాల ఏర్పాటు?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆమన్‌గల్‌లో మెడికల్ కళాశాల కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక్కడ పాలిటెక్నిక్ మరియు డిగ్రీ కళాశాలలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ 2018లో హామీ ఇచ్చారు. ఇవన్నీ కార్యరూపం దాల్చిన తర్వాత, ఆటోమెటిగ్గా ఆమన్‌గల్‌కు చుట్టుపక్కల ఐదు మండలాల నుంచి రాకపోకలు పెరుగుతాయి. మెడికల్ కళాశాల ఏర్పాటైతే, దేశవ్యాప్తంగా ఆమన్‌గల్‌కు మంచి పేరు లభిస్తుంది.
కేబుల్ బ్రిడ్జి..
ప్రస్తుతం కొల్లాపూర్ వరకూ డబుల్ లైన్ రోడ్డు ఉంది. అక్కడ్నుంచి సోమశిల మీదుగా నంద్యాల వరకూ ఉన్న సింగిల్ రోడ్డును ప్రభుత్వం రెండు వరసల రహదారిగా డెవలప్ చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.1100 కోట్లను వెచ్చిస్తోంది. సోమశిలపై తీగల వంతెనను సుమారు రూ.860 కోట్లను వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తీగల వంతెన పై రోడ్డులో వాహనాలను అనుమతించడమే కాకుండా.. కింద రోడ్డును పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతారు. అంటే, అక్కడ కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించే విధంగా రోడ్డును అభివృద్ధి చేయడం వల్ల.. దాని మీద నడిచే పర్యాటకులకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రహదారిని అభివృద్ధి చేయలేదంటే నమ్మండి. రెండు గుట్టలు దాటితే సంగమేశ్వర ఆలయం వస్తుంది. అక్కడే తుంగభద్ర, కృష్ణా నదులు కలుస్తాయి. మొత్తానికి, ఇలాంటి అభివృద్ధికి ఆమన్‌గల్ చేరువలో ఉండటం విశేషం.
అరగంటలోపే
తుక్కుగూడ నుంచి హాజీపూర్ దాకా గల రెండు వరుసల రహదారిని ఫోర్ లేన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.1725 కోట్లను వెచ్చిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. అరగంటలోపే తక్కుగూడ నుంచి ఆమన్‌గల్‌కు చేరుకోవచ్చు.
ధరలెలా ఉన్నాయి?
2018 కంటే ముందు ఆమన్ గల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎకరం ధర రూ.10 లక్షలుండేది. ఆతర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. మైసిగండి నుంచి నాగర్ కర్నూలు వెల్దండ వరకూ.. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా.. ఎకరం ధర రూ.2 నుంచి 3 కోట్ల దాకా పలుకుతోంది. కాస్త లోపలికి వెళితే రూ.కోటీ నుంచి కోటీన్నర చెబుతున్నారు. ఆమన్ గల్ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా గజం ధర రూ.50 వేలు పలుకుతోంది. కాస్త లోపలికి వెళితే గజానికి రూ.10 వేలు చొప్పున ప్లాట్లు ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాట్లు కావాలనుకునేవారు కాస్త ఎక్కువ రేటు పెట్టాల్సి ఉంటుంది.
- ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని regnews21@gmail.comకి పంపించండి.