కొత్త నిబంధనలతో మాస్టర్ ప్లాన్ కూర్పు
గృహాలు, వినోద కేంద్రాల నిర్మాణాలకే అనుమతులు
రెండున్నర దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 111 జీవో రద్దుపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 111 జీవో పరిధిలోని 84 గ్రామాలలో కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పలుమార్లు బహిరంగ సభల్లోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో నిపుణులు కమిటీ తలమునకలైంది. ఇటీవల 111 జీవోను రద్దు చేస్తూ హెచ్‌ఎండీఏ పరిధిలోని భవన నిర్మాణ నిబంధనలే 111 జీవోలోని 84 గ్రామాలకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది కొంత వరకు సమంజసం కాదని భావిస్తున్న నిపుణులు కమిటీ.. భవన నిర్మాణ నిబంధనలలో పలు సవరణలు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను పరిరక్షించడంతో పాటు 111 జీవో పరిధిలోని 84 గ్రామాలలో కాంక్రీట్ జంగిల్‌గా అస్తవ్యస్తంగా కాకుండా ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ భావిస్తుంది. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ), బఫర్ జోన్‌లు, గ్రీన్ బెల్ట్‌లు, వంద అడుగుల వెడల్పాటి అప్రోచ్ రోడ్లు, భూ వినియోగం, పార్కింగ్ వంటి పలు కఠినతర నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు.
లేఅవుట్‌కు ఐదు ఎకరాలు..
హెచ్‌ఎండీఏ పరిధిలో లే–అవుట్ అనుమతులు జారీ చేయాలంటే కనీసం ఎకరం విస్తీర్ణం ఉంటే సరిపోతుంది. అయితే 111 జీవో పరిధిలో మాత్రం ఇలా చిన్న చితకా వాటికి కాకుండా కనిష్టంగా ఐదెకరాలు, అంతకుమించి ఉండే స్థలాలకు మాత్రమే లే–అవుట్ పర్మిషన్లు మంజూరు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న మాస్టర్ ప్లాన్‌లో ఈ కొత్త నిబంధనలను పొందుపరచనున్నారు. రోడ్ల వెడల్పు, లే–అవుట్ విస్తీర్ణం, భూ వినియోగం, పార్కింగ్ నిబంధనలు తదితర అంశాలలో మున్సిపాలిటీలతో పోలిస్తే హెచ్‌ఎండీఏ నిబంధనలు చాలా కఠినతరంగా ఉండనున్నాయి. అలాగే 111 జీవో పరిధిలో నివాస సముదాయాలతో పాటు వినోద కేంద్రాల నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. అలాగే 100 ఎకరాలు, 20 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి చేయాలని కమిటీ నిర్ణయించింది. అంతేకాకుండా నీటి వనరులకు 100 మీటర్లు, నాలాకు 50 మీటర్ల దూరంలో ఉంటే నీటిపారుదల, రెవిన్యూ శాఖల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తప్పనిసరి అని అధికారులు తెలిపారు.