- రియల్ రంగంలో పెరుగుతున్న ప్రవాసుల పెట్టుబడులు
భారత రియల్ రంగంలో ప్రవాస భారతీయుల ప్రాభవం పెరుగుతోంది. స్థిరాస్తిలో వారి పెట్టుబడులు వెల్లువలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత చాలామంది ఎన్నారైలు రెసిడెన్షియల్ వైపు మక్కువ ప్రదర్శిస్తున్నట్టు తేలింది. ఈ విభాగంలో వారి పెట్టుబడులు దాదాపు రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనం. కరోనా ముందు ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్టుల్లో ఎన్నారైల వాటా 10 శాతం లోపే ఉండగా.. కరోనా తర్వాత అది 20 శాతం దాటింది.
గతంలో కమర్షియల్ ప్రాపర్టీల వైపు మొగ్గు చూపిన ఎన్నారైలు.. ఇటీవల కాలంలో రెసిడెన్షియల్ విభాగం పైనా దృష్టి సారించారు. లగ్జరీ విల్లాలు, లగ్జరీ అపార్ట్ మెంట్లు, హైరైజ్ టవర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. రూపాయితో పోలిస్తే డాలరు విలువ పెరగడంతో మనదేశంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం అని వారు భావిస్తున్నారు. పైగా వారు ఏ ప్రాజెక్టులో పడితే ఆ ప్రాజెక్టులో కాకుండా అన్నీ పరిశీలించిన తర్వాతే ముందడుగు వేస్తున్నారు. బిల్డర్ ట్రాక్ రికార్డు.. ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూ.. గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేశారా లేదా అనేవి చూశాకే పెట్టుబడి పెడుతున్నారు.