poulomi avante poulomi avante

111 జీవో పూర్తి స్థాయి తొల‌గింపు ఇప్ప‌ట్లో అయ్యే ప‌ని కాదు?

No Impact of 111 GO Removal on Hyderabad Realty

  • రియ‌ల్ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డ‌దు
  • కొనుగోలుదారులు కొంత వేచి చూస్తారు
  • కృత్రిమంగా ధ‌ర‌లు పెరగ‌డానికే నిర్ణ‌యం

ట్రిపుల్ వన్ జీవో.. తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. సామాన్యుల నుంచి మొదలు బడా రియల్ ఎస్టేట్ వర్గాల వరకు ట్రిపుల్ వన్ జీవో పైనే చర్చ. తెలంగాణ ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీఓ ను రద్దు చేయడంతో ఆ పరిధిలోని భూములు తద్వార ఇంటి స్థలాలు, ఇళ్లు తక్కువ ధరకు లభిస్తాయని చాలా మంది భావిస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో నిర్మాణమైన, నిర్మాణంలో ఉన్న ఇళ్ల అమ్మకాలు పడిపోతాయన్న చర్చ సైతం జరుగుతోంది. ఇంతకీ ట్రిపుల్ వన్ జీవో ఉపసంహరణ ప్రభావం భాగ్యనగర నిర్మాణ రంగంపై ఏ మేరకు ఉంటుంది? ఇళ్ల అమ్మకాలు తగ్గుతాయా? రియల్ రంగ నిపుణులు ఏమంటున్నారు?

గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ప్ర‌స్తుతం ఇళ్ల ధరలు ఎక్కువున్నాయి. దీంతో 111జీవో పరిధిలో నిర్మాణాలు ప్రారంభమైతే తక్కువ ధరకే ఇళ్లు, ఇళ్ల స్థలాలు లభిస్తాయన్న ఆలోచనలో కొనుగోలుదారులు ఉన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఇళ్ల ధరలు సుమారు చదరపు అడుక్కీ రూ. 5 వేల నుంచి 12 వేల దాకా ఉంది. ప్రాంతాన్ని బట్టి ఇంటి ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి. సిటీ శివారు ప్రాంతాల్లో 5 వేల లోపే ఫ్లాట్లు దొరుకుతున్నాయి. అంటే డబుల్ బెడ్రూం ఇల్లు కావాలంటే కనీసం 60 నుంచి 70 లక్షలు పెట్టాలి. సిటీలోని ప్రైమ్ ఏరియాలో అయితే చదరపు అడుక్కీ 6 వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకు ధరలున్నాయి. మంచి మౌలిక వసతులు ఉండి డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఇళ్లు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కోటి రూపాయల పైనే ఖర్చుపెట్టాల్సిందే. ఇటువంటి సమయంలో 111 జీవో ఎత్తేయడం, ఆ ప్రాంతమంతా ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ జిల్లా పరిసరాల్లోనే ఉండటంతో ఇంటి కొనుగోలుదారులు ఆలోచనల్లో పడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించిన 111 జీవో పరిధిలోని ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైతే ఐటీ హబ్ ప్రాంతంతో పోలిస్తే ఇళ్లు కొంత మేర తక్కువ ధరకే దొరుకుతాయన్నది అందరి ఆలోచన. అంతే కాదు ఎక్కువ ధర పెట్టి సిటీలో అపార్టుమెంట్లలో ఇంటిని కొనుగోలు చేసే బదులు అదే ధరకు 111 జీవో పరిధిలోని ప్రాంతంలో ఇంటి స్థలం, వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనుగోలు చేయవచ్చనే భావన కొనుగోలుదారుల్లో కనిపిస్తోంది. దీంతో కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట, గోపన్‌పల్లి, నల్లగండ్ల వంటి పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతాలలో ఇల్లు కొనాలనుకుంటున్నవారు పునరాలోచనలో పడ్డారు.
111జీవో ప్రభావం ఇప్పటికే హైదరాబాద్లో నిర్మాణం పూర్తి చేసుకున్న, ఇంకా నిర్మాణంలో ఉన్న ఇళ్లపై పడుతుందన్న చర్చ కూడా రియల్ వర్గాల్లో జరుగుతోంది. 111 జీవో పరిధిలో నిర్మాణాలు ప్రారంభమైతే తక్కువ ధరకే ఇళ్లు లభిస్తాయన్న ఆలోచనలో ఉన్న వారంతా ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నార‌ని స‌మాచారం. దీంతో హైదరాబాద్ లోని ఇళ్ల అమ్మకాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన నిర్మాణ సంస్థల్లో కనిపిస్తోంది. అయితే రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు మాత్రం ఇప్పటికిప్పుడు 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలు మొదలవుతాయని భావించడం లేదని అంటున్నారు. ప్రభుత్వం 111జీవోను ఎత్తేస్తున్నట్లు మాత్రమే ప్రకటించిందని, దాని పరిధిలో నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందని చెబుతున్నారు. ఇది ఎన్నికల సమయం కావడంతో తెలంగాణ సర్కార్ రాజకీయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది.
111జీవో కు సంబంధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు కోర్టు కేసుల విషయంలోను పలు అనుమానాలున్నాయి. అంతే కాకుండా 111జీవో ఉపసంహరణను సవాల్ చేస్తూ పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్‌ ప్లాన్‌ వంటి వాటిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఆ సమయానికి ఇక్కడి భూములకు మరింత డిమాండ్ ఏర్పడటంతో పాటు ధరలు భారీగా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో భూముల ధరలు పెరగడం, నిర్మాణ వ్యయం తడిసిమోపడవుతున్న నేపధ్యంలో 111 జీవో పరిధిలో ఇళ్లు తక్కువ ధరలకు వస్తాయా అన్నది బేరీజు వేసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles