మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసిన ఈడీ
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్ టెక్ చైర్మన్, యజమాని ఆర్కే అరోరాను మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ కేసులో మూడోసారి విచారించిన అనంతరం పీఎంఎల్ఏ చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద అరోరాను అరెస్టు చేసినట్టు ఈడీ వెల్లడించింది. ఆయన్ను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తీసుకోవాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. సూపర్ టెక్ గ్రూప్ డైరెక్టర్లు, ప్రమోటర్లపై ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ లలో మనీ లాండరింగ్ కింద పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ గ్రూప్ డైరెక్టర్లకు చెందిన రూ.40 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తమ ప్రాజెక్టులో ఫ్లాట్ల అమ్మకం పేరుతో పలువురి నుంచి అడ్వాన్సుల రూపేణా పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసిన తర్వాత ఫ్లాట్ల అప్పగింతలో విఫలం కావడం ద్వారా సూపర్ టెక్ సంస్థ క్రిమినల్ కుట్రకు పాల్పడిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.