- బెంగళూరులో ఓ హౌసింగ్ సొసైటీ వినూత్న నిర్ణయం
- హైదరాబాద్ లోనూ నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాల్సిందే
వేసవి వచ్చేసింది. నీటి కష్టాలు మొదలైపోయాయి. ముఖ్యంగా నగరాల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు పనిచేయవు. ఈ నేపథ్యంలో అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ట్యాంకర్లే దిక్కు. భారత సిలికాన్ సిటీగా పేరు పొందిన బెంగళూరులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వర్షాకాలంలో తగినంతగా వానలు పడకపోవడంతో కావేరి నదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర కటకట ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ భద్రంగా చూసుకోవాల్సిన ఆవశ్యతను తెలియజేసింది. ఇందుకోసం బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని ఓ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. దీనిని పర్యవేక్షించేందుకు ఓ సెక్యూరిటీ గార్డును కూడా నియమించింది.
వైట్ ఫీల్డ్ లోని ది పామ్ మెడోస్ హౌసింగ్ సొసైటీ ఈ మేరకు తన నివాసితులకు నోటీసు జారీ చేసింది. సొసైటీకి గత నాలుగు రోజులుగా నీటి సరఫరా రావడంలేదని, అందువల్ల ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయొద్దని పేర్కొంది. నీటి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రతి ఫ్లాట్ యజమానీ నీటి వినియోగాన్ని 20 శాతం మేర తగ్గించాలని సూచించింది. ఎవరైనా నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించకుండా వాడినవారికి రూ.5వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ పదేపదే ఇదే ఉల్లంఘనలు చేస్తే జరిమానా మొత్తం మరింత పెరుగుతుందని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సెక్యూరిటీ గార్డును నియమించినట్టు తెలిపింది. మరోవైపు బెంగళూరులోని ఇతర హౌసింగ్ సొసైటీలు కూడా రోజువారీ నీటి వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.
హైదరాబాద్ లోనూ చాలా ప్రాంతాల్లో వేసవిలో నీటి ఎద్దడి సాధారణమే. దీంతో అనేక ప్రాంతాల్లో అపార్ట్ మెంటు వాసులు, ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నవారు ట్యాంకర్లను ఆశ్రయించక తప్పదు. ఇక గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లు కనీసం రెండు రోజులకు ఓసారైనా వాటర్ ట్యాంకర్ తెప్పించుకునే పరిస్థితి నెలకొంటుంది. దీంతో నిర్వహణ చార్జీలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా నీటి వృథాను అరికట్టే చర్యలు చేపట్టాల్సిందే. ప్రతి నీటి బొట్టునూ భద్రంగా చూసుకుని వాడుకుంటే అటు నీటి వృథాను అరికట్టడంతోపాటు డబ్బులు కూడా ఆదా చేసుకున్నవారు అవుతారు.