కేంద్ర మంత్రి హర్దీప్ ఎస్ పూరి
దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరి పేర్కొన్నారు. 2004 నుంచి 2104 మధ్య పట్టణ ప్రాంతాల్లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 2014 నుంచి 2023 మధ్యకాలంలో అవి ఏకంగా రూ.18 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. దేశంలో పౌరులందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికి దేశవ్యాప్తంగా స్థిరమైన పట్టణాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.
నగరాలు ఆర్థిక వృద్ధికి కేంద్రాలని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి, పాలనలో సాంకేతికతను వినియోగించాలని.. తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. దేశంలో స్మార్ట్ సిటీస్ గురించి ఆయన విద్యార్థులకు వివరించారు. స్మార్ట్ సిటీస్ కింద స్థాపించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు వార్ రూమ్ లుగా మారాయని.. దాదాపు 100 స్మార్ట్ సిటీస్ లో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇవి బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఫలితంగా మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. మహిళల భద్రతకు కూడా సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని పూరి చెప్పారు.