దేశీయ రియల్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు స్వల్పంగా పెరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది. జనవరి-జూన్ కాలంలో ఇది 2.94 బిలియన్ డాలర్లు(దాదాపు 24,110 కోట్లకు) చేరినట్టు తెలిపింది. గతేడాది ఇదే కాలంలో ఇది 2.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ లో రియల్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు స్వల్పంగా పెరగడం గమనార్హం. భారత రియల్టీపై విశ్వాసం కొనసాగడానికి ఇది దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, జనవరి-జూన్ కాలంలో ప్రాపర్టీ రంగంలోకి 22 లావాదేవీల ద్వారా దాదాపు 2.94 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది చివరినాటికి ఇది 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.