చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ సిటీలో అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో వరుస పిటీషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదురౌతున్నాయి. హైడ్రాను ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 99ను చాలా మంది కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు. నిర్మాణాల కూల్చివేత సందర్భంగా హైకోర్టులో పెద్ద ఎత్తున పిటీషన్లు దాఖలవుతున్నాయి.
దాంతో హై కోర్టులో హైడ్రాకు సంబంధించిన కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించే ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు హైడ్రా కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కేసుల్లో నిర్మాణదారులకు, యజమానులకు తక్షణమే సాంత్వన లభించేందుకు, త్వరితగతిన కేసుల పరిష్కారానికి ట్రిబ్యునల్ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అంతే కాకుండా హైకోర్టు పై భారాన్ని తగ్గించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఉత్తమమన్న న్యాయ నిపుణుల సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
హైడ్రాకు సంబంధించిన వివాదాల్లో ఒకవేళ ట్రైబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలున్న పక్షంలో హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక హైడ్రాకు సంబంధించిన ట్రిబ్యునల్ ఛైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ను నియమించాలనే నిర్ణయానికి తెలంగాణ సర్కార్ వచ్చినట్లు తెలుస్తోంది. హైడ్రా ట్రిబ్యునల్ లో వివిధ రంగాలకు చెందిన ముగ్గురు నిపుణులు సభ్యులుగా ఉంటారని, అవసరమైతే మరో ఇద్దరికి అవకాశమిస్తారని సమాచారం.
ఈ క్రమంలోనే హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు తెస్తున్న ఆర్డినెన్స్‌లో హైడ్రా ట్రిబ్యునల్ అంశాన్ని ప్రస్తావించేందుకు ఉన్న అవకాశాల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశీలిస్తోంది. తెలంగాణ రెరా, దేవాదాయ శాఖల ట్రిబ్యునళ్ల మాదిరిగానే హైడ్రాకు సైతం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. మరోవైపు హైడ్రాకు మరో కీలక బాధ్యత కూడా అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే.. నిర్మాణాలు చేపట్టేలా ఆ సంస్థకు అధికారాలు కట్టబెట్టనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన విధివిధానాలను తర్వలోనే ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
This website uses cookies.