- ముసాయిదా రూపొందించిన పంజాబ్ సర్కారు
సామాన్యుడి సొంతింటి కల నిజం చేసే దిశగా పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ చర్యలు చేపట్టింది. అందుబాటు గృహాల పాలసీని సిద్దం చేస్తోంది. తమ ప్రభుత్వం కొత్తగా అందుబాటు గృహాల పాలసీని రూపొందిస్తోందని పంజాబ్ మంత్రి అమరన్ అరోరా తెలిపారు. సామాన్యుడి సొంతింటి కల నిజం చేసేందుకు ఉన్న ఏ మార్గాన్నీ తాము వదలిపెట్టబోమని స్పష్టంచేశారు. ‘పంజాబ్ అఫార్డబుల్ హౌసింగ్ పాలసీ-2022’ ముసాయిదాను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశామని, ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్నామని వెల్లడించారు.
కొత్త పాలసీ ప్రకారం ప్లాట్లతో కూడిన కాలనీకి కనీస ఐదు ఎకరాలు ఉండాలని నిర్దేశించామని, అదే గ్రూప్ హౌసింగ్ కు కనీస స్థలం రెండు ఎకరాలు ఉండాలని పేర్కొన్నారు. సాధారణ కాలనీల్లో ప్రస్తుతం ఉన్న 55 శాతం అమ్మకపు స్థలాన్ని 65 శాతానికి పెంచామని తెలిపారు. సామాన్యుడికి అందుబాటు ధరలో ప్లాట్లు రావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా భూ వినియోగ మార్పిడి, డెవలప్ మెంట్ చార్జీలు, ఇతరత్రా రుసుములను 50 శాతం మేర తగ్గించినట్టు చెప్పారు. గరిష్ట ప్లాట్ సైజును 150 గజాలుగా, గరిష్ట ఫ్లాట్ ను 90 చదరపు మీటర్లుగా నిర్ణయించినట్టు తెలిపారు. నిర్మాణ వ్యయం తగ్గించడం కోసం పార్కింగ్ నిబంధనల్లో వెసులుబాటు కల్పించినట్టు వివరించారు. అయితే, ఈ పాలసీ కొత్త చండీగఢ్ (ముల్లాన్ పూర్) లో వర్తించదని మంత్రి స్పష్టం చేశారు.