తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో రైలు మార్గం పనుల్ని నిలిపివేయడం వల్ల.. హైదరాబాద్ రియాల్టీ రంగానికొచ్చే నష్టమేం ఉండదని రియల్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, నగర నిర్మాణ రంగం మెట్రో రూటు మీద పెద్దగా ఆధారపడలేదని.. అది ఏర్పాటు కాకపోకపోయినా రియల్ రంగానికొచ్చే ఇబ్బందేం లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని ప్రతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు మెట్రోరైలు కనెక్టివిటీ ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ కోణంలో ఆలోచించి గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ మార్గంలో మెట్రో పనుల్ని ఆరంభించిందని తెలిపారు. ఇది హైదరాబాద్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తుందే తప్ప.. రియల్ మార్కెట్ ను శాసించే స్థాయికింకా చేరుకోలేదని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొత్తలో.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. నగరంలో మెట్రో రైలు ఏర్పాటుపై పూర్తి వ్యతిరేకతతో ఉండేవారు. అసెంబ్లీ ముందు నుంచి మెట్రో వెళ్లనివ్వనని.. సుల్తాన్ బజార్ వీధుల్లో మెట్రో ఎలా వెళుతుందని ప్రశ్నించేవారు. అందుకే, అప్పుడు మెట్రో రైలు సేవలు హైదరాబాద్‌లో ఏడాదిన్నర ఆలస్యంగా ఆరంభమయ్యాయి. ఇదే అంశంపై గత కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2018 ఎన్నికల సందర్భంలోనూ ఇదే అంశాన్ని కొందరు నాయకులు ప్రచారం కూడా చేశారు. కాకపోతే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన అదే కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ మాదిరిగా, రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో మార్గాన్ని నిలిపివేయడం ఎంతవరకూ సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో మార్గాన్ని అర్థాంతరంగా నిలిపివేయాలన్న నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే తీసుకున్నారా? లేక తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నదా? అని నగర ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదీఏమైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐటీ నిపుణులు, ప్రవాస భారతీయులు ఒక్కసారిగా షాక్‌కు గురైన మాట వాస్తవమే. తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మీద దృష్టి పెట్టాలి తప్ప.. నగరాభివృద్ధికి అడ్డుకట్ట వేసే నిర్ణయాలు తీసుకోవడమేమిటని విస్తుపోతున్నారు.
హైదరాబాద్ అభివృద్ధి అనేది రాయదుర్గం శంషాబాద్ మెట్రో కారిడార్ మీద ఆధారపడలేదనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే, పశ్చిమ హైదరాబాద్‌లో నివసించే ప్రజానీకం ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఎక్కువగా క్యాబ్‌ల మీదే ఆధారపడతారనే సంగతి తెలిసిందే. అందులో కొందరు అవకాశముంటే ఆర్టీసీ బస్సుల్లోనూ విమానాశ్రయానికి వెళతారు. కాబట్టి, కేవలం మెట్రో రైలు వస్తుందనే కారణంతో ఎవరూ కోకాపేట్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో కానీ ఫ్లాట్లు కొనడం లేదని తెలుసుకోవాలి. మెట్రో రైలు ఏర్పాటైతే అదొక అదనపు సౌకర్యంగా నిలుస్తుంది. హైదరాబాద్‌కే తలమానికంగా మారుతుంది. అంతేతప్ప, మెట్రో రాకపోవడం వల్ల కోకాపేట్‌లో కానీ నార్సింగిలో కానీ ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టనే పట్టవు. కాబట్టి, మెట్రో రైలుకు సంబంధించి.. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆలోచన కూడా వీలైనంత త్వరగా మారిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
This website uses cookies.