Categories: Celebrity Homes

రిషికేశ్ లో వ్యక్తిగత బంగ్లా

    • రియల్ ఎస్టేట్ గురుతో వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల

ఎవరైనా సరే.. టెన్నిస్ కోర్టు, ప్రైవేటు బీచ్, పన్నెండు బెడ్ రూములు, ఇంట్లోనే సినిమా థియేటర్ తో కూడిన విశాలమైన ఎస్టేట్ ను కలిగి ఉండరు. వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల కూడా అంతే. సమంతతో కలిసి శాకుంతలంలో కనిపించబోయే ఈ భామ కలల సౌధం ఎలా ఉండాలో తెలుసుకునేందుకు ‘రియల్ ఎస్టేట్ గురు’ ఆమెతో ముచ్చటించింది. జీవితంలో అత్యుత్తమ ఇంటిని కొనుగోలు చేయాలనే ఆకాంక్షను బయటపెట్టిన అనన్య అంతరంగంలో ఇంకా ఏముందో చూద్దామా?

‘నేను చుట్టూ మొక్కలు, చెట్లు పిచ్చిగా ఉండే ప్రదేశంలో పుట్టి పెరిగాను. ఆ తర్వాత నేను నా కుటుంబంతో కలిసి ఖరీదైన ఈ నగరానికి వచ్చాను. అన్ని కాలాల్లోనూ అత్యంత ప్రగతిశీలంగా ఉండే నగరంలో నివసిస్తున్నప్పటికీ, నేను పుట్టి పెరిగిన స్థలాన్ని మాత్రం మరచిపోలేను. వాయు, శబ్ద కాలుష్యం లేని ఆ ప్రదేశంలోనే నా బాల్యమంతా గడిచింది. అదే నన్ను స్వచ్ఛత వైపు నడిపించింది’ అని అనన్య పేర్కొన్నారు. ఆమె మాతో మాట్లాడుతూనే అక్కడ అనవసరంగా ఉన్న వస్తువులను తీసివేయడం.. కొన్ని వస్తువులను సర్దడాన్ని గమనించాం. ఆమె సింప్లిసిటీగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారని గ్రహించాం. చక్కని, వ్యవస్థీకృతమైన, గందరగోళరహిత జీవనానికి తాజా మార్గం.. సాధారణ డెకరేషన్ మాత్రమే అనే సూత్రాన్ని అనన్య బలంగా నమ్ముతారని తెలుసుకున్నాం. ఈ జీవితంలో సాధారణంగా జీవించడం.. ఎక్కువగా ఆలోచించడమే తన గో-టూ మంత్ర అని వెల్లడించారు. ఈ ప్రపంచంలోని డబ్బంతా తన దగ్గర ఉంటే.. తాను కోరుకున్న బంగ్లా నిర్మించుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయబోనని స్పష్టంచేశారు. తన కలల సౌథంలో స్థలం, లైటింగ్, ఇంకా వస్తువులు సమాన ప్రాధాన్యతతో ఉంటాయని వివరించారు. ‘బోల్డ్, ఫంక్షనల్, అత్యంత బాగా గుర్తుండిపోయేలా నా స్టైల్ ఉంటుంది. బోరింగ్ ఉండటానికి నేను చాలా దూరం’ అని పేర్కొన్నారు. తనకు బంగళాలు అంటేనే ఇష్టమని చెప్పిన అనన్య.. వ్యక్తిగత గృహాన్ని అందమైన, మనోహరమైన ఆస్తిగా అభివర్ణించారు.

‘నేను చాలా చిన్న ఇంట్లో పెరిగానని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు స్టార్ గా నా పేరు మీద పెద్ద ఆస్తి ఉండాలని కోరుకుంటున్నాను. దానికి పచ్చదనం మరింత వన్నె తెస్తుంది. నా సొంత ప్రాపర్టీలో నా ఆహారాన్ని నేనే పండించుకోవడాన్ని ఇష్టపడతాను. ఇక సినిమాలకు ముగింపు పలికిన తర్వాత ఈ విశ్వనగరం నుంచి బయటకు వెళ్లిపోయి పొలాలు ఉండే చోట స్థలం కొనుక్కుంటాను’ అని అనన్య వెల్లడించారు. తల్లితో తన అనుబంధం చాలా బలమైనదని.. తల్లి లేకుంటే తన కలలసౌధం చాలా అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘ఎంత ఖరీదైన బంగళా అయినా సరే.. ఓ కుటుంబం కలిసి నవ్వుతూ జీవించే అందమైన నివాసంగా దానిని ఎలా మార్చాలో మా అమ్మకు కచ్చితంగా తెలుసు. నేను ఇద్దరు పిల్లలకు తల్లైనా సరే.. మా అమ్మ నా దగ్గరే ఉండాలని బలంగా కోరుకుంటాను’ అని తెలిపారు. ఇక తాను నివసించే ఏ ఇంట్లోనైనా సరే తనకు అత్యంత ఇష్టమైనది బాల్కనీ అని వెల్లడించారు. ‘వీలైనంత ఎక్కువగా సూర్యకిరణాలు నా ముఖంపై పడటాన్ని బాగా ఆస్వాదిస్తాను. ఇంకా అక్కడ కూర్చుని నా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించడం ఇష్టపడతాను. ఇక రెండోది మార్కెట్ లో ప్రస్తుతం వస్తున్న ఈ కొత్త సోఫాలు అంటే నాకు చాలా ఇష్టం. సినిమాలను ఎక్కువగా చూస్తాను కాబట్టి.. ఉత్తమమైన, సౌకర్యవంతమైన సోఫా సెట్ నా బెడ్ రూం లేదా హాల్లో ఉండాల్సిందే’ అని అనన్య పేర్కొన్నారు.

‘ప్రస్తుతం నేను యోగాలో నిమగ్నమై ఉన్నాను. నా జీవితంలో రిషికేశ్ లో స్థిరపడాలనేది నా బలమైన కోరిక. నా ఇంట్లోకి సూర్యకాంతి ధారాళంగా రావాలి. ఎందుకంటే నా సొంత ఇంట్లో నిరాశగా ఉండటాన్ని ఇష్టపడను. అలాగే పెద్దపెద్ద రణగొణ ధ్వనుల మధ్య జీవించలేను. ఇక నా కలల ఇల్లు అన్నింటికీ అనుగుణంగా ఉండాలి. సాంకేతికంగా చెప్పాలంటే ఆచరణాత్మక కారణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాను. ఉదాహరణకు సమీప స్టోర్ కు ఉండే దూరం కూడా ఇక్కడ అవసరమే’ అని అనన్య వివరించారు. తన కలల ఇంటిని తనకు తానుగా అలంకరించుకునే ప్రావీణ్యత ఉన్నందున ఆమెకు ఇంటీరియర్ డిజైనర్ అవసరం రాదు. అందమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించే ప్రాంతం లేదా చెట్లు, వృక్ష సంపద బాగా ఉన్న ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలన్నదే తన కోరిక అని పేర్కొన్నారు. అదే సమయంలో కిటికీలు చిన్నవిగా ఉంటే.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి, సూర్యకాంతి లోపలకు రావడానికి అవకాశం ఉండదని, అలాంటప్పుడు ఇల్లు ఎంత అందంగా ఉన్నా, ప్రయోజనం లేదనేది ఆమె భావన. అందువల్ల తన ఇంటికి పెద్ద కిటికీలు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇక సెలబ్రిటీల ఇళ్లలో నిశ్శబ్దం ఫేమ్ అంజలి ఇల్లు తనకు బాగా నచ్చిందని అనన్య వెల్లడించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని ఆమె వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం ఇది వేగంగా అభివృద్ధి చెందుతోంది. రెప్పపాటులో ఓ ఎత్తైన ఆకాశహర్మ్యం వస్తోంది. మన నగరం బహుళ జాతులతో రద్దీగా మారింది. జీవనశైలి కూడా మారింది. ట్రాఫిక్ పెరిగింది. అయితే, ప్రతి సంవత్సరం నిర్వహించే సర్వేలలో నివాసానికి అనువైన ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఎదిగింది’ అని అనన్య పేర్కొన్నారు.

This website uses cookies.