- బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన
దేశంలోని గ్రామీణ పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. సొంతిల్లు కొనుక్కునేందుకు లేదా కొత్త ఇల్లు కట్టుకునేందుకు కేంద్రం ఓ పథకం తీసుకొస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఈ మేరకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటన చేశారు. మోదీ సర్కారు గడిచిన పదేళ్లలో సమ్మిళిత వృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఇల్లు, నీరు, విద్యుత్, వంట గ్యాస్, బ్యాంక్ ఖాతా అందించే దిశగా ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించామని పేర్కొన్నారు. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నామని.. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తామని స్పష్టంచేవారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది.