Categories: TOP STORIES

యాదగిరిగుట్టలో మరో రియల్ మోసం

  • ప్రీలాంచ్ పేరుతో కొల్లగొట్టిన లక్ష్మీ నివాసం రియల్ ఎస్టేట్ కంపెనీ
  • మొత్తం సొమ్ము చెల్లించినవారికి నెలానెలా అద్దె చెల్లిస్తామని ఆఫర్
  • తొలుత కొన్ని నెలలు అద్దె ఇచ్చి.. ఆనన ముఖం చాటేసిన వైనం

రియల్ ఎస్టేట్ రంగంలో పాదర్శకత కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మోసాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రీలాంచ్ పేరుతో కొంతమంది, బైబ్యాక్ పేరుతో మరికొంత మంది కొనుగోలుదారులను నిలువునా ముంచేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆఫర్లతో వేలాది మంది కొనుగోలుదారులను పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసం చేసి కోట్లు సంపాదించాయి. తాజాగా ఇలాంటి మోసం మరొకటి వెలుగు చూసింది.

యాదగిరి గుట్ట సమీపంలోని వంగపల్లిలో సూట్ రూములు నిర్మిస్తున్నామని చెప్పి లక్ష్మీ నివాసం అనే రియల్ ఎస్టేట్ కంపెనీ పలువురిని ముంచేసింది. 2022లో ఒక్కో సూట్ రూమ్ రూ.22,25,000 చొప్పున విక్రయించింది. వీటిని బుక్ చేసుకున్నవారికి ప్రీలాంచ్ ఆఫర్ వల వేసింది. మొత్తం సొమ్ము చెల్లించిన వారికి నెలకు రూ.12వేల చొప్పున అద్దె చెల్లిస్తామని పేర్కొంది. 2023 డిసెంబర్ లోగా ప్రాజెక్టు పూర్తి చేసి అప్పగిస్తామని.. అప్పటివరకు అద్దె చెల్లిస్తామని స్పష్టం చేసింది. తొలుత రెండు బ్లాకులు నిర్మాణం చేపట్టిన సంస్థ.. అనంతరం తన మోసానికి పదును పెట్టింది. ఈ ప్రాజెక్టులో మరో నాలుగు బ్లాకులు రాబోతున్నాయని.. అన్నింట్లో ఫ్లాట్లన్నీ బుక్ అయ్యాయని, ఇక రెండు బ్లాకుల్లో మాత్రమే ఖాళీలున్నాయని ప్రచారం ముమ్మరం చేసింది. దీంతో పలువురు కొనుగోలుదారులు ఆకర్షితులై తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశారు.

తొలుత అద్దె సక్రమంగా చెల్లించిన కంపెనీ.. తర్వాత అది కూడా ఎగనామం పెట్టింది. దీంతో కొనుగోలుదారులు కంపెనీ చుట్టూ తిరగ్గా.. ఇదిగో, అదిగో అంటూ కొంత కాలయాపన చేశారు. తాజాగా ఫోన్లకు కూడా స్పందించడం మానేశారని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. కంపెనీ తమను నిలువునా మోసం చేసిందని.. కేవలం రెండు బ్లాకులకు మాత్రమే అనుమతులున్నాయని పేర్కొన్నారు. తమను మోసం చేసిన కంపెనీ యజమానిపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

This website uses cookies.