-
నలగండ్ల ప్రజల ఆవేదన
-
బాధ భరించలేక రోడెక్కిన బాధితులు
-
24 గంటలూ పని చేస్తే ఎలా?
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అపర్ణా గ్రూప్.. ఇరవై నాలుగు గంటల పాటు నిర్మాణ పనుల్ని జరిపిస్తుందని.. ఫలితంగా, తమకు కంటి మీద కునుకు ఉండట్లేదని.. ఆ ప్రాంతమంతా కాలుష్యంతో నిండిపోయిందని నిరసిస్తూ.. కొంతమంది ప్రజలు ఒక బృందంగా ఏర్పడి అపర్ణా జైకన్ ప్రాజెక్టు ముందు ఇటీవల ధర్నా నిర్వహించారు. అపర్ణా సంస్థ నిబంధనల్ని పాటించకుండా నిర్మాణాల్ని చేపడుతూ.. ప్రశాంతత లేకుండా చేస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇరవై నాలుగ్గంటలూ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగి చిన్నారులు, మహిళలు, పెద్దలు.. ఇలా ప్రతిఒక్కరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని.. అందుకే, ధర్నా చేశామని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా, కనీసం రాత్రిపూట అయినా నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని వీరంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.
జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం.. సాయంత్రం ఆరు తర్వాత ఏ సంస్థ కూడా నిర్మాణ పనుల్ని చేయకూడదు. కాకపోతే, ఈ నిబంధన పేరు కోసమే ఉంది కానీ.. హైదరాబాద్‌లోని ఏ బిల్డరూ ఈ నిబంధనను పెద్దగా పట్టించుకోడు. ఖాళీ ప్రదేశాల్లో ఇరవై నాలుగు గంటలు నిర్మాణాల్ని చేపడితే.. ఎవరికీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే, జనవాసాలు ఉన్న చోట.. రాత్రింబవళ్లు పని చేస్తేనే.. అక్కడ నివసించే ప్రజలకు ఎక్కడ్లేని ఇబ్బంది కలుగుతుంది. ఈ క్రమంలో కొందరు బిల్డర్లు జనవాసాలున్న చోట ఏం చేస్తారంటే.. రాత్రి 8 లేదా 10 గంటల వరకూ నిర్మాణ పనుల్ని చేపట్టి.. ఆ తర్వాత నిలిపివేస్తారు. చుట్టుపక్కల కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నట్లయితే.. బిల్డర్లు తప్పకుండా రాత్రిపూట పనుల్ని నిలిపివేస్తారు. కాలుష్య నియంత్రణ మండలి కూడా ఇదే చెబుతున్నది.
ఏ నిర్మాణ సంస్థ అయినా.. ఉదయం పూట 55 డెసిబిల్స్ మరియు రాత్రివేళ 45 డెసిబిల్స్ ను మించి శబ్ద కాలుష్యం చేయడానికి వీల్లేదు. కాకపోతే, ఈ నిబంధనను హైదరాబాద్‌లో పట్టించుకున్న బిల్డర్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. బడా బిల్డర్లు అటు పోలీసులకు ఇటు పీసీబీ అధికారులు, సిబ్బందికి.. ప్రతినెలా అధిక స్థాయిలో ముడుపులు చెల్లిస్తూ. ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఎవరైనా బిల్డర్ రాత్రిపూట పని చేస్తుంటే.. ప్రజలు పోలీసులు ఫోన్ చేసి చెబితే.. వాళ్లొచ్చి ఏదో హడావిడి చేసి వెళ్లిపోతారు. ఆతర్వాత ఆయా బిల్డర్లు యధావిధిగా పని చేస్తారు. కాబట్టి, రాత్రిపూట పని చేయకుండా బిల్డర్లను నిరోధించాలంటే.. ప్రజలంతా కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది. ఈ క్రమంలో స్థానిక సంస్థ, పీసీబీలపై కోర్టుకెళ్లి కేసు వేస్తేనే.. అక్కడి ప్రజలు రాత్రివేళలో ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆస్కారం ఉంటుంది.