కాంపౌండింగ్ ఫీజు చెల్లిస్తే టీడీఆర్‌లకు అర్హులని జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ మల్లిఖార్జున్ రావు తెలిపారు. బుధవారం నగరంలో నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు వేల చదరపు గజాలపై ఉన్న వాటికీ టీడీఆర్ మీద రెండు అంతస్తుల అనుమతిని తీసుకోవచ్చని.. అంతకంటే తక్కువ ఉన్నవాటికీ ఒక్క అంతస్తుకు మాత్రమే లభిస్తుందన్నారు. ఒక అపార్టుమెంటుకు అనుమతి తీసుకుంటే ఆరేళ్ల దాకా వర్తిస్తుందని.. వ్యక్తిగత ఇళ్లకు మూడేళ్ల అనుమతి మాత్రమే లభిస్తుందన్నారు. మిడ్ ల్యాండింగ్ లిఫ్టును పెట్టుకుంటే ఎన్వోసీ ఇవ్వడం కష్టమవుతుందని తెలిపారు. నివాస సముదాయాలకు అనుమతిని తీసుకుని వాణిజ్య నిర్మాణాలు కడితే ఎన్వోసీ మంజూరు చేయలేమన్నారు. వాణిజ్య సముదాయాల్ని కట్టాలని భావించేవారు అదే అనుమతిని తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సంపత్ మాట్లాడుతూ.. పార్కింగ్ లేకుండా వ్యక్తిగత ఇళ్లను కట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఫలితంగా, రోడ్ల మీదే వాహనాల్ని పార్కు చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కాబట్టి, వ్యక్తిగత గృహాల్ని నిర్మించేవారు స్టిల్ట్ పార్కింగుకు అనుమతి తీసుకుని.. మిగతా పై ఫ్లోర్లలో ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఏసీపీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమతికి దరఖాస్తు చేసిన వెంటనే టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతిని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. టీడీఆర్ కాంపౌండింగ్ ఫీజుకు సంబంధించిన కంప్యూటరైజేషన్ పనులు వారం రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఏసీపీ గణపతి మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో టీడీఆర్ మంజూరు చేస్తామని.. అలాంటి చోట బిల్డర్లకు టీడీఆర్ తక్షణమే మంజూరు చేస్తామన్నారు. దీంతో, ఆయా సైట్ల విలువ పెరగడంతో పాటు సైట్ల విలువ కూడా అధికం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రేమ కుమార్, ఛైర్మన్ చెన్నా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్, సలహాదారు నర్రా నాగేశ్వర రావు, ట్రెజరర్ సుభాష్ బాబు, ఉపాధ్యక్షులు కోటేశ్వర రావు, లక్ష్మీ నారాయణ, మన్నే రవి, కార్యనిర్వాహక కార్యదర్శులు నరసింహ రెడ్డి, రామ్ కుమార్, ధీరజ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు లక్ష్మీపతి రాజు, రాజేంద్ర ప్రసాద్, బసంత్ కుల్దీప్, బి వి. సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.