Categories: LATEST UPDATES

బెంగళూరులో తగ్గనున్న అపార్ట్ మెంట్ అద్దెలు?

నీటి కష్టాల నేపథ్యంలో పెట్టుబడిదారుల పునరాలోచన

ఫలితంగా 10 నుంచి 15 శాతం అద్దెలు తగ్గుతాయని అంచనా

కోవిడ్ సమయంలో మినహా అద్దెలు పెరగడమే తప్ప.. తగ్గడం తెలియన బెంగళూరులో పరిస్థితి మారింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న నీటి కష్టాల కారణంగా అపార్ట్ మెంట్ అద్దెలు 10 నుంచి 15 శాతం మేర తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బెంగళూరులో నెలకొన్న నీటి ఎద్దడి వల్ల స్థిరాస్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పునరాలోచనలో పడటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మఖ్యంగా ఈ సమస్య నగరంలోని ఐటీ కారిడార్ కు సమీపంలోనే ఎక్కువగా ఉంది.

అనాలోచిత అభివృద్ధి బెంగళూరు తూర్పు ఐటీ కారిడార్, సెంట్రల్ ఏరియాల్లో నీటి కొరతకు దారి తీసింది. చెరువుల, సరస్సులను ఆక్రమించి ఇష్టానుసారం నిర్మాణాలు సాగించడంతో భవిష్యత్తులో నీటి లభ్యతపై మరింత ఆందోళన కలుగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు. నిజానికి గత రెండేళ్లలో బెంగళూరులో అద్దెలు బాగా పెరిగాయి. టెక్ నిపుణులు ఇష్టపడే ప్రాంతాల్లో 2 బీహెచ్ కే అపార్ట్ మెంట్ అద్దెలు గతేడాది కంటే పెరిగాయి. అయితే, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో పెట్టుబడిదారులు, అద్దెదారులు ఉత్తర బెంగళూరు, ఇందిరానగర్ వంటి నీటి లభ్యత బాగానే ఉన్న ప్రాంతాల వైపు చూస్తున్నారు. పెద్ద గేటెడ్ కమ్యూనిటీ నుంచి దూరంగా తక్కువ నీరు అవసరమయ్యే చిన్న ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇది బెంగళూరులో అద్దె ధరలు, మొత్తం హౌసింగ్ ల్యాండ్ స్కేప్ పై ప్రభావం చూపుతోంది.

నీటి సంక్షోభం ఇలానే కొనసాగితే అద్దె ధరల్లో గణనీయమైన తగ్గుదల ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా బెంగళూరు ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ నీటి సంక్షోభం రియల్ రంగంపై పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాల్లో ఇది కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు.

This website uses cookies.