నిలిపివేసిన అపార్టుమెంట్ సొసైటీ రిజిస్ట్రేషన్లను కొనసాగించాలి
తెలంగాణలో నిలిపివేసిన నివాసితుల సంక్షేమ సంఘాల (రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్) రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల రోజువారీ కార్యకలాపాల్ని అందులోని నివాసితులే నిర్వహించేందుకు రెసిడెంట్స్ వెల్ఫేర్ సంఘాలు ఏర్పాటయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం సంఘాలు 2019 జనవరి దాకా తెలంగాణ రాష్ట్ర సొసైటీల చట్టం ప్రకారం నమోదయ్యాయని పేర్కొన్నారు. అయితే, 2019లో అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ మరియు ఐజీ ఒక సర్క్యులర్‌ను విడుదల చేశారని.. హై కోర్టు తీర్పు ప్రకారం సొసైటీ ఏజీఎం లేదా మరే ఇతర డాక్యుమెంట్‌ను జిల్లా రిజిస్ట్రార్లు రిజిస్టర్ చేయడం సాధ్యం కాదని.. అవసరమైతే వారు సహకార చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సలహా ఇచ్చారని చెప్పారు. 2013లో ఇచ్చిన జడ్జిమెంట్‌ను ఆరేళ్ల తర్వాత అమల్లోకి తేవడమేమిటని ఈ సందర్భంగా యూ-ఫెర్వాస్ సభ్యులు ప్రశ్నించారు. సొసైటీ /అసోసియేషన్‌లో సభ్యత్వం మరియు ఇతర కార్యకలాపాలకు మెయింటెనెన్స్ కోసం డబ్బు వసూలు చేయడం తెలంగాణ సొసైటీస్ యాక్ట్ 2001 కింద రిజిస్టర్ చేసుకోవడానికి అడ్డంకిగా ఉంటుందని కమిషనర్ మరియు ఇన్స్‌పెక్టర్ జనరల్ ఎలా నిర్ధారణకు వచ్చారన్నది కూడా ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
హై కోర్టు ఆర్డర్ కూడా ఎలాంటి లక్ష్యాలూ లేని ఒక సొసైటీకి సంబంధించిందేనని.. ఆయా సొసైటీ నిర్వహణ ప్రజా సేవ పరిధిలోకి రాదని కోర్టు గుర్తు చేసిందని తెలిపారు. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రంలోని నిర్వహణ సంఘం లక్ష్యాలు మెయింటనెన్స్‌తో పాటు ఇతర అంశాలు ముడిపడి ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధానంగా మతపరమైన, క్రీడలు, సాంస్కృతిక, కార్యక్రమాలు, ఎలాంటి లాభం లేకుండా. సభ్యులంతా స్వచ్ఛందంగా చేస్తున్నారని వివరించారు. ఈ మేరకు సొసైటీల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని యూ-ఫెర్వాస్ నవీన్ మిట్టల్‌ని కోరింది. మరి, ఈ అంశంపై ఆయన ఎలా స్పందిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.