Categories: Rera

మధ్యలో మారినా పాత డెవలపర్ దే బాధ్యత

మహా రెరా స్పష్టీకరణ
ప్రాజెక్టుకు సంబంధించిన డెవలపర్ మధ్యలో మారిపోయినా.. కొనుగోలుదారుల క్లెయిమ్ విషయంలో బాధ్యత వహించాల్సిందేనని మహారాష్ట్ర రెరా స్పష్టంచేసింది. సదరు డెవలపర్ ఉన్నప్పుడు జరిగిన కొనుగోళ్లకు అతడు లేదా ఆ సంస్థదే బాధ్యత అని పేర్కొంది. ఈ విషయంలో ప్రస్తుత డెవలపర్ ఎలాంటి బాధ్యత వహించరని వివరించింది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో మురికివాడల పునరావాసానికి సంబంధించిన నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విషయంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. మురికివాడ పునరావాస అథారిటీ (ఎస్ఆర్ఏ) నిబంధనలను పాటించలేదనే ఆరోపణల నేపథ్యంలో ఆ డెవలపర్ ను రద్దు చేసి కొత్త డెవలపర్ ను నియమించారు.

2017లో రెరాలో నమోదైన ఈ ప్రాజెక్టు ఎస్ఆర్ఏ పరిధిలో ఉంది. అయితే, నిర్మాణం, డెలివరీ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనందుకు ఎస్ఆర్ఏ అసలు డెవలపర్ ను తొలగించింది. అనంతరం 2024 మార్చిలో ప్రాజెక్టును కొత్త డెవలపర్ కు అప్పగించింది. 2460 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 20 అంతస్తుల భవనంలో 113 అపార్ట్ మెంట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 48 యూనిట్లు విక్రయించారు. వారంతా స్వాధీనం చేసుకోవడం కోసం వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు తమ క్లెయిమ్ లను కొత్త డెవలపర్ తో కాకుండా పాత డెవలపర్ తోనే దాఖలు చేయాల్సి ఉంటుందని మహారెరా పేర్కొంది. ప్రాజెక్టుకు సంబంధించి పాత డెవలపర్ చేసిన ఖర్చులను తిరిగి చెల్లించాలని కొత్త డెవలపర్ కు సూచించింది.

ఈ రీయింబర్స్ మెంట్ పూర్తయిన తర్వాత ఇప్పటికే ఉన్న కొనుగోలుదారుల పట్ల బాధ్యతలన్నీ పాత డెవలపరే నెరవేర్చాలని స్పష్టంచేసింది. బాధ్యతల విషయంలో స్పష్టమైన విభజన నిర్ధారించడం కోసం కొత్త డెవలపర్ కు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ ను కూడా కేటాయించింది. పాత డెవలపర్ ఈ ప్రాజెక్టులోని ఏ అపార్ట్ మెంటునూ మార్కెట్ చేయడం లేదా విక్రయించడం వంటివి చేయకూడదని తేల్చి చెప్పింది. పాత డెవలపర్ ఇప్పటికే ఉన్న గృహ కొనుగోలుదారుల పట్ల అన్ని బాధ్యతలను నెరవేర్చాలని, పెండింగ్ లో ఉన్న అన్ని క్లెయిమ్‌లను పరిష్కరించాలని స్పష్టంచేసింది.

This website uses cookies.