-
కాయ్.. రాజా కాయ్..
-
ఇప్పుడు కొంటే 2.4 కోట్లు
-
రెండేళ్లయ్యాక రూ. 6 కోట్లు
-
ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇలా అమ్మొచ్చా?
-
ఆర్కిటెక్ట్- జెనెసిస్ ప్లానర్స్
నిర్మాణ రంగంలో ఇరవై ఏళ్ల అపార అనుభవమున్న బిల్డర్.. మియాపూర్‌లో 10 ఎకరాల్లో 1066 ఫ్లాట్లను కడుతున్నాడు. శిల్పారామం వద్ద యాభై వేల చదరపు అడుగుల్లో కమర్షియల్ టవర్ నిర్మిస్తున్నాడు. ఇంత అనుభవమున్న డెవలపర్.. కొల్లూరులో ప్రీలాంచ్లో విల్లాల్ని విక్రయించాల్సిన ఖర్మ ఎందుకు? ఇప్పటికే ఆరంభించిన రెండు నిర్మాణాల్ని పూర్తి చేయడానికి తగినంత సొమ్ము చేతిలో లేదా? లేక కొల్లూరులో ఆయా స్థల యజమానులకు సొమ్ము కట్టేందుకు విల్లాల్ని అమ్ముతున్నాడా? ఏదీఏమైనా ఇరవై ఏళ్ల అనుభవం ఉన్నట్లు చెప్పుకుంటున్న బిల్డర్.. ఇలా దొంగదారిలో.. అక్రమ పద్ధతిలో.. విల్లాల్ని అమ్మాల్సిన కక్కుర్తి ఎందుకు? ఈయన విల్లాలు కట్టకపోతే బయ్యర్లు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారా? విల్లాల్ని నిర్మించకపోతే నిరహారదీక్షలు చేస్తామని ప్రజలేమైనా ప్రతిజ్ఞ చేస్తున్నారా?
కొల్లూరులో సరికొత్త రీతిలో మాయాజాలం.. అరచేతిలో వైకుంఠం.. ఇంతకుమించిన బంపర్ ఆఫర్ లేదు.. అబ్రకదబ్రా.. ఇప్పుడు కొంటే విల్లా రేటు కేవలం రూ.2.4 కోట్లే. నెల రోజుల్లోపు మొత్తం సొమ్ము చెల్లించాలి. చుట్టుపక్కల ప్రాంతంలో విల్లాల రేటు రూ.3.2 కోట్ల దాకా పలుకుతోంది. ఇదే విల్లా ఆరు నెలల తర్వాత రూ.6 కోట్లు అవుతుంది. ఆలస్యం చేస్తే ఆశాభంగం. ఇంతకుమించిన గొప్ప ఆఫర్ లేనే లేదు. రండి బాబు రండి.. మీ దగ్గర ఉన్న సొమ్మంతా ఊడ్చీ మా జేబులో పోయండి.. మేం కట్టివ్వగానే తీసుకోండి.. అప్పటివరకూ అడగకండి.. కేవలం యాభై విల్లాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్..
కొల్లూరులో ప్రీలాంచ్లో విల్లాల్ని అమ్ముతున్న సంస్థ ప్రతినిధిని రెజ్ న్యూస్ సంప్రదించగా.. ఆస్పైర్ స్పేసెస్, భవ్య సంస్థ పేర్లు వెలుగులోకి వచ్చాయి. విల్లా ప్లాన్లను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్.. జెనసిస్ ప్లానర్స్ పేరు దర్శనమిచ్చింది. నిబంధనల ప్రకారం చూస్తే.. తెలంగాణ రెరా అథారిటీ ప్రకారం.. అనుమతులన్నీ సక్రమంగా తీసుకున్నాకే నిర్మాణ సంస్థలు ప్రకటనల్ని విడుదల చేయాలి. అమ్మకాల్ని చేపట్టాలి. కానీ, నిర్మాణ రంగంలో ఇరవై ఏళ్లకు పైగా అనుభవం గల బిల్డర్.. ప్రీలాంచ్లో విల్లాల్ని అమ్మడమెందుకు? రెరా అనుమతి తీసుకున్నాక దర్జాగా విల్లాల్ని అమ్మొచ్చు కదా?